- రూ.280కోట్లతో ప్రతిపాదనలు కాగితాల్లోనే..
- ముంపు పరిష్కార చర్యలు తాత్కాలికమే
- గతేడాది వానలకు మునిగిన సిరిసిల్ల పట్టణం
- ఈసారీ తప్పని వరద ముప్పు?
రాజన్నసిరిసిల్ల, వెలుగు : జిల్లా కేంద్రమైనా సిరిసిల్లకు వరద ముంపు తప్పడం లేదు. ఏటా వర్షాలతో ముంపునకు గురవుతోంది. గతేడాది కురిసిన వానలకు టౌన్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత సర్కార్ హయాంలో రూ.280కోట్లతో వరదల నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి.
వరదలు వచ్చినప్పుడే తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని టౌన్ ప్రజలు వాపోతున్నారు. చిరుజల్లులకే సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంతం జలమయమై రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో రానున్న వానకాలాన్ని తలుచుకొని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
రూ.280కోట్లతో ప్రతిపాదనలు
గతేడాది వర్షాలతో పట్టణం పూర్తిగా మునిగిపోయింది. పాత బస్టాండ్ ప్రాంతంలోని షాపుల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం జరిగింది. షాపుల్లోని సామగ్రి, వస్తువులు పాడయ్యాయి. ఏటా ఈ ప్రాంతం మునుగుతుండడంతో పట్టణవాసులతో పాటు ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చెరువు ప్రాంతం నుంచి పాత బస్టాండ్ వరకు నీరు నిలువడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈక్రమంలో సిరిసిల్ల టౌన్‌కు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి నాటి మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ హామీ ఇచ్చారు.
రూ.280కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేయించారు. రగుడు బైపాస్ నుంచి వరద కాలువ నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ ఎక్కడా పనులు స్టార్ట్ చేయలేదు. కాగా శాంతినగర్‌లో రూ.6 కోట్లతో తాత్కాలిక కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. కొత్త చెరువు వద్ద నాలాలు కబ్జా అయ్యాయి. వీటిపై నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. దీంతోపాటు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నిర్మించాల్సి ఉంది. పనులన్నీ పెండింగ్‌లో ఉండగా ఈసారి కూడా సిరిసిల్లకు వరద ముప్పు తప్పేలా లేదని పట్టణవాసులు టెన్షన్ పడుతున్నారు.
మునుగుతున్న కాలనీలు
సిరిసిల్ల పట్టణం ఎగువ ప్రాంతాల్లో 20 చెరువులు ఉన్నాయి. ఇవి మత్తళ్లు దుంకినప్పుడు సిరిసిల్ల టౌన్‌కు వరద ముంపు పెరుగుతోంది. ఈదుల చెరువు,పెద్దచెరువు, కొలనూరి చెరువు, మర్తనపేట, జంగంవాణి, భామనికుంట, ఎర్రకుంట, కొలనూర్ ట్యాంక్, గిర్రవాణికుంట చెరువులు మత్తడి దుంకినప్పుడల్లా ఆ నీరు టౌన్‌ను ముంచుతోంది. ఈ వరదనీరంతా కొత్త చెరువులోకి చేరుతోంది.
అయితే ఈ చెరువు నుంచి మిడ్‌మానేరుకు వరద నీటిని మళ్లించాల్సి ఉండగా.. దీనికి ఔట్ ఫ్లో లేకపోవడంతో చెరువు నీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో వెంకంటపేట, ప్రగతినగర్, బీవైనగర్, సుందరయ్యనగర్, శాంతినగర్, సంజీవయ్యనగర్, అంబేద్కర్ నగర్, పాతబస్టాండ్ కాలనీలు మునుగుతున్నాయి.