కలిసిరాని కులం కార్డు

  •      సిరిసిల్లలో చతికిల పడ్డపద్మశాలీ ఇండిపెండెంట్లు
  •      ఫలించని సామాజిక వర్గ నినాదం

రాజన్నసిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో  పద్మశాలీ  ఓట్లను  నమ్ముకొని  పోటీ చేసిన అభ్యర్థులకు భంగపాటు తప్పలేదు.  అత్యధిక ఓట్లున్న పద్మశాలీలు తమకే ఓట్లు  వేస్తారని  ఆదే  సామాజిక వర్గం నుంచి  ఇద్దరు  అభ్యర్థులు  ఎన్నికల్లో పోటీ చేశారు.  కానీ  ఇద్దరికి  మూడు వేల లోపు ఓట్లే వచ్చాయి.  బీజేపీ   రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉండి   టికెట్  రాకపోవడంతో  లగిశెట్టి శ్రీనివాస్  ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. మరో  నేత సురేశ్​ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు. అయితే లగిశెట్టి శ్రీనివాస్ కు కేవలం 2561 ఓట్లురాగా, సురేశ్​ కు 1161 ఓట్లు మాత్రమే వచ్చాయి.  పద్మశాలీలు వారికే ఓటు వేసి ఉంటే  కేటీఆర్ గెలుపుపై ఎఫెక్ట్ ఉండేది. 

ఆనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

పద్మశాలీల ఓట్ల విషయంలో  పట్టణంలో  అంచనాలు తారుమారయ్యాయి.  పట్టణంలో   88వేల ఓట్లు ఉండగా అందులో 59వేల ఓట్లు పోలయ్యాయి.   ఇందులో దాదాపు   40వేల ఓట్లు పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినవే.  ‘ నేతన్నల ఓట్లు నేతన్నలకే’ అనే నినాదంతో ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు. అయినా  ఇద్దరికి అతి తక్కువ ఓట్లు వచ్చాయి. సిరిసిల్ల నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి మంచి పట్టుందని భావించారు. రూరల్ ఓట్లన్ని ఆయనకు పడితే సిరిసిల్ల టౌన్ ఓట్లు ఇద్దరు పద్మశాలీ అభ్యర్థులకు వస్తాయని భావించారు.  

కాంగ్రెస్ అభ్యర్థి కేకే గెలుపు ఖాయం అని సర్వత్రా భావించారు. కాని  పట్టణంలో  కేకే మహేందర్ రెడ్డికి 16వేల ఓట్లు  దక్కాయి.  ఇద్దరు పద్మశాలీ అభ్యర్థులకు 3వేల ఓట్లు రావడంతో మిగితా ఓట్లన్ని కేటీఆర్ కు పడ్డాయి.  రూరల్ ఏరియాలో కేకే గట్టి పోటీ  ఇచ్చినప్పటికి పద్మశాలీ ఓట్లు చీలకపోవడంతో కేకే ఓటమి పాలయ్యారు. ఆది నుంచి కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల పట్టణం ఓట్ల కంటే రూరల్ లో విస్త్రృతంగా ప్రచారం చేశారు. పద్మశాలీలు చివరికి కేటీఆర్ వైపే మొగ్గు చూడంతో కేటీఆర్ కు 29వేల మెజార్టీ లభించింది.

లేట్ గా  వచ్చి లేటెస్ట్ ప్రచారం

బీజేపీ అభ్యర్థి రాణి  రుద్రమను సిరిసిల్ల అభ్యర్థిగా ఆలస్యంగా ప్రకటించారు. దీంతో సిరిసిల్ల బీజేపీ నాయకులు కొందరు నారాజ్​ అయి, తమకు  టికెట్ కేటాయించలేదని  పార్టీ మారారు. దీంతో రాణి రుద్రమ 20 రోజులు క్యాడర్ లేకుండానే సొంతంగా ప్రచారానికి వెళ్లింది. కేంద్ర పథకాలు, సిరిసిల్లలో పవర్లూం క్లస్టర్ ఏర్పాటు ప్రకటన లాంటి వాటితో ఆమెకు 18వేల పై చిలుకు ఓట్లను సంపాదించుకుంది. 

భారీగా తగ్గిన కేటీఆర్ మెజార్టీ

సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే గట్టిపోటీ నియ్యడంతో కేటీఆర్ మెజార్టీ భారీగా తగ్గింది. 2018 ఎన్నికల్లలో కేటీఆర్ కు 89వేల ఓట్లు మెజార్టీ రాగా ఈ ఎన్నికల్లో కేవలం 29వేల మెజార్టీ మాత్రమే వచ్చింది. కాంగ్రెస్ గాలి, కేకే  వరుసగా మూడు సార్లు  ఓడిపోయారన్న  సింపతీ, కేటీఆర్ అనుచరులపై వ్యతిరేకత కలిసి కేకే గెలుస్తాడని   భావించారు.  ఎన్నికల ప్రచారం చివరి రోజు కేటీఆర్ రోడ్ షో, బీఆర్​ఎస్ నాయకులు పోల్ మేనేజ్ మెంట్ తో  బీఆర్​ఎస్​ విజయం సాధించింది.