సిరిసిల్ల అర్బన్ ​బ్యాంకు చైర్మన్‌‌పై .. రెండోసారి అవిశ్వాసం

  • 9 మంది డైరెక్టర్లు డీసీవోకు అవిశ్వాస నోటీస్​
  • 15న బలనిరూపణకు డీసీవో నిర్ణయం 
  • ఎలాగైనా గట్టేందుకు బీఆర్ఎస్​ ప్లాన్​

రాజన్న సిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్‌‌పై రెండోసారి అవిశ్వాసం ప్రకటించారు. గత నెల 21న 9 మంది డైరెక్టర్లు చైర్మన్ గాజుల నారాయణపై డీసీవోకు అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీస్​ అందజేశారు.  తమను సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా సిరిసిల్లలో అర్బన్ బ్యాంక్ చైర్మన్‌‌పై అవిశ్వాసం హాట్ టాపిక్ మారింది. దీంతో మరోసారి మంత్రి కేటీఆర్ ఇలాఖాలో  బీఆర్ఎస్‌‌లో లుకలుకలు బయటపడ్డట్లయింది. కాగా ఎన్నికలు దగ్గరపడుతున్నందున అవిశ్వాసం గట్టెందుకు అధికార బీఆర్ఎస్​ ప్లాన్​ చేస్తోంది. ఈవ్యవహారంలో స్వయంగా మంత్రి కేటీఆరే రంగంలోకి దిగినట్లు సమాచారం. 

గతేడాది వీగిన అవిశ్వాసం

గతేడాది జూన్ 10న అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణపై ఆరుగురు డైరెక్టర్లు అవిశ్వాస నోటీసులు అందజేశారు. జులై 4న బలపరీక్షకు తేదీ ఖరారు చేయగా అవిశ్వాసం పెట్టిన డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. దీంతో  అవిశ్వాసం వీగిపోయినట్టు డీసీవో బుద్దనాయుడు ప్రకటించారు.  అనంతరం అవిశ్వాస లీడర్లను మంత్రి కేటీఆర్ పిలిచి మాట్లాడారు. చైర్మన్‌‌ గాజుల నారాయణను కూడా పిలిచి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాజాగా  డైరెక్టర్లు  మళ్లీ ఆవిశ్వాసం నోటీసులు అందజేయడం సిరిసిల్లలో హాట్ టాపిక్ గా మారింది. 

ALSO READ :తెలంగాణ రచయితల సంఘాలు

సిరిసిల్లలో తీవ్ర చర్చ

రానున్న ఎన్నికల్లో క్యాడర్ కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ సూచిస్తున్నారు. ఈ టైంలో అధికార పార్టీకి చెందిన అర్బన్​బ్యాంక్​డైరెక్టర్లు చైర్మన్‌‌పై అవిశ్వాసం పెట్టడం సిరిసిల్లలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం వెనుక కేటీఆర్ ముఖ్య అనుచరుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది అవిశ్వాసం వీగిన టైంలో ముఖ్య నాయకులకు ముడుపులు అందకపోవడంతోనే ఈసారీ ఈ వ్యవహారం తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు చైర్మన్​గాజుల నారాయణ పదవీకాలం 9నెలలే ఉండగా, ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆరే నిర్ణయం తీసుకుంటారని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అవిశ్వాసం నెగ్గుతుందా, వీగుతుందా అనేది 15 వరకు వేచిచూడాల్సిందే. 

15న బలనిరూపణ  

అర్బన్ బ్యాంక్ చైర్మన్‌‌పై 9 మంది డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీస్​ అందజేశారు. వాటిని పరిశీలించి ఈ నెల 15న బలనిరూపణకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

డీసీవో బుద్దనాయుడు