- బూతులు తిడుతుందని, స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తోందని ఆరోపణ
- తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ ట్రైబల్ స్కూల్ స్టూడెంట్స్ నిరసన
- అవుట్ సోర్సింగ్ పీఈటీ జోత్స్నను సస్పెండ్ చేసిన కలెక్టర్
తంగళ్లపల్లి, వెలుగు: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థులు గురువారం ఉదయం సిరిసిల్ల, సిద్దిపేట రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇక్కడ పని చేసే పీఈటీ జ్యోత్స్న తమను బూతులు తిడుతుందని, రక్తం వచ్చేలా కొడుతుందని, స్నానం చేసే సమయంలో వీడియోలు తీసి బెదిరిస్తోందని స్టూడెంట్స్ ఆరోపించారు. తక్షణమే పీఈటీ జ్యోత్స్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
జ్యోత్స్నఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పని చేస్తోంది. ఆమె వేధింపులు భరించలేక ప్రిన్సిపల్ కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం 580 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఈవో, పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పినా నిరసన విరమించేందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో కలెక్టర్, డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో రఘుపతి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్న పీఈటీ జోష్ణను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో విద్యార్థులు నిరసన విరమించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ను సాయంత్రం సందర్శించి జరిగిన సంఘటన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఏబీవీపీ నాయకుల ధర్నా..
విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ... పీఈటీ జ్యోష్ణవిద్యార్థినుల ఫొటోస్, వీడియోలు ఎందుకు తీసిందో కమిటీ వేసి ఎంక్వైరీ చేయించాలన్నారు. దీని వెనక ఎవరెవరూ ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రిన్సిపల్‌ను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలన్నారు. గురుకుల హాస్టల్స్‌లో జరుగుతున్న ఘటనలపై హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజురావు, విభాగ్ లా కన్వీనర్ సామానపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.