కిడ్నాప్ అయిన పాప సేఫ్

  • ఎట్టకేలకు మహబూబాబాద్ లో పట్టుకున్న పోలీసులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: గత నెల 23న మిస్సింగ్ అయిన నాలుగేళ్ల చిన్నారి అద్వైతను సిరిసిల్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకుని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కు తరలించారు. ఎస్పీ  అఖిల్ మహాజన్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం..  జగిత్యాల జిల్లా  కొడిమ్యాల మండలం, చింతపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు,లాస్య దంపతులు కూతురు అద్వైతతో  గత నెల 17న వేములవాడ టెంపుల్ దర్శనానికి వచ్చారు.  కాగా లాస్యకు మతిస్థిమితం లేకపోవడంతో ఐదు రోజులుగా రాజన్నకు మొక్కులు చెల్లించేందుకు ఆలయ ఆవరణలోనే ఉన్నారు. 

ఇదే సమయంలో  మహబూబాబాద్‌‌‌‌కు చెందిన శ్రీరామోజు నర్సమ్మ, గంభీరపు అంజవ్వ, కనుపురి ఉప్పమ్మ అనే ముగ్గురు మహిళలు వేములవాడ దర్శనానికి వచ్చి వీరు కూడా ఐదు రోజులుగా గుడి ఆవరణలోనే ఉంటున్నారు. లాస్య మతిస్థిమితం లేకపోవడంతో  ముగ్గరు మహిళలు గత నెల 23న అద్వైతను అపహరించారు.  అద్వైత మేనమామ గత నెల 30న వేములవాడ పోలీస్ స్టేషన్‌‌‌‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఎస్పీ అఖిల్ మహాజన్ అద్వైతను పట్టుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు.  

సీసీ కెమెరాలను పరిశీలించి, టెక్నాలజీ ఉపయోగించి నిందితులు మహబూబాబాద్ లో ఓ గ్రామంలో ఉన్నట్లు తెలుసుకున్నారు.  ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ సాయంతో పోలీస్ స్పెషల్ టీం వెళ్లి పాపను సురక్షితంగా తీసుకొచ్చారు.  ప్రస్తుతం అద్వైత చైల్డ వెల్పేర్ సెంటర్  పరిరక్షణలో ఉంచారు. ముగ్గురు నిందితులైన శ్రీరామోజి వెంకట నర్సమ్మ, గంబీరపు అంజవ్వ ,ఉప్పమ్మ లను పోలీసులు రిమాండ్ కు తరలించారు.