- ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడకుండా సొంతంగా బిజినెస్
- టవల్స్, లుంగీలు తయారీతో పాటు మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నరు
- యజమానులుగా మారుతున్న నేత కార్మికులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సరికొత్త ఆలోచన, ఆచరణ.. ఈ రెండూ ఉంటే ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవచ్చని నిరూపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన కొందరు నేతన్నలు. ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లపై ఆధారపడకుండా తమ సొంత ఆలోచనతో ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే బట్టను ఉత్పత్తి చేస్తూ ఇదే రంగంలో లాభాలు సాధిస్తున్నారు. కాలం చెల్లిన సాంచాలను పక్కన పెట్టి మోడ్రన్ లూమ్స్‌ను వాడుతూ వేగంగా బట్టను తయారు చేయడమే కాకుండా సొంతంగా మార్కెటింగ్ సైతం చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడకుండా...
ప్రభుత్వ ఇచ్చే ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్మికులకు కొన్ని రోజుల వరకే ఉపాధి దొరికేది. ఆర్డర్లు లేని టైంలో ఇటు ప్రభుత్వ పని లేక, అటు సొంతంగా వ్యాపారం చేసుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో కొందరు ఔత్సాహిక నేతన్నలు తమ ఆలోచనలను పదును పెట్టారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లతో సంబంధం లేకుండా సొంతంగా సాంచాలు కొని నడిపించుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. ప్రజలు ఎక్కువగా ఉపయోగ పడే వస్త్రాలను తయారు చేస్తూ మార్కెటింగ్ సైతం చేసుకుంటున్నారు.
కార్మికుల నుంచి యజమానులుగా...
సిరిసిల్ల నెహ్రూనగర్‌కు చెందిన అల్వాల సత్యనారాయణ వివిధ కార్ఖానాల్లో 25 ఏండ్లు కార్మికుడిగా పనిచేశాడు. ఆరు నెలల నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడడంతో బతుకుదెరువు కష్టమైంది. దీంతో సంక్షభం నుంచి ఎలాగైనా గట్టెక్కాలని ఆలోచించి తానే సొంతంగా వ్యాపారం చేయడం ప్రారంభించాడు. అందరి మాదిరిగానే చీరలు ఉత్పత్తి చేస్తే నిలదొక్కుకోవడం కష్టమని భావించి ప్రతి ఇంట్లో నిత్యం వాడుకునే టవల్స్ తయారీకి మొగ్గు చూపాడు. ఇందుకోసం తక్కువ సమయంలో స్పీడ్‌గా, క్వాలిటీతో క్లాత్‌ను ఉత్పత్తి చేసే లూమ్స్‌ను కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం తాను కార్మికుడిగా పనిచేసిన టైంలో త్రిఫ్ట్ పథకం కింద దాచుకున్న డబ్బులకు తోడు కొంత అప్పు చేసి రూ. మూడు లక్షలతో రెండు మోడ్రన్ ర్యాపియర్ లూమ్స్ కొనుగోలు చేసి ఇంట్లోనే బిగించుకున్నాడు. తంగళ్లపల్లి టెక్స్‌టైల్ పార్క్ నుంచి భీములు తెచ్చుకుని టవల్స్ ఉత్పత్తి ప్రారంభించాడు. ఉత్పత్తి చేసిన టవల్స్‌ను సిద్దిపేట, కరీంనగర్, వేములవాడ, జగిత్యాల ప్రాంతాల్లో మార్కెటింగ్ చేస్తున్నాడు. టవల్స్ క్వాలిటీగా ఉండడంతో వివిధ షాపింగ్ మాల్స్ నుంచి ప్రత్యేక ఆర్డర్లు సైతం వస్తున్నాయి. భార్యతో కలిసి తానే స్వయంగా క్లాత్‌ను ఉత్పత్తి చేస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. ఒక రోజుకు 30 మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ రూ. 1000 నుంచి రూ. 1,500 సంపాదిస్తున్నారు. కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన సత్యనారాయణ ప్రస్తుతం రెండు మోడ్రన్ ర్యాపియర్ లూమ్స్‌కు యజమానిగా మారాడు.
సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన గురువయ్య బతుకమ్మ చీరల ఆర్డర్లను తీసుకోకుండా లుంగీలను తయారు చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు. పదిహేను ఏండ్ల కింద కార్మికుడిగా పనిచేసిన గురువయ్య యజమాని కావాలని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా తాను దాచుకున్న డబ్బుతో రెండు సాంచాలు కొనుగోలు చేసి లుంగీ క్లాత్‌ను ఉత్పత్తి చేస్తున్నాడు. వచ్చిన లాభాలతో రెండేండ్ల కింద మరో రెండు సాంచాలు కొనుగోలు చేశాడు. సిరిసిల్ల పట్టణంలోని అందరు ఆసాములు బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తే గురువయ్య మాత్రం ఆ ఆర్డర్ తీసుకోకుండా తాను నమ్ముకున్న లుంగీల క్లాత్ తయారీనే కొనసాగించాడు. ప్రస్తుతం నాలుగు సాంచాలపై లుంగీల క్లాత్ ఉత్పత్తి చేస్తూ సొంతంగా మార్కెంటింగ్ చేసుకుంటున్నాడు. ఫలితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నప్పటికీ గురువయ్య బిజినెస్ మాత్రం లాభాలను చూపుతోంది.
సుందరయ్యనగర్‌కు చెందిన గూట్ల వెంకటేశం కాటన్ చీరల ఉత్పత్తితో ముందుకు సాగుతున్నారు. ఇతడు తయారు చేసే కాటన్ చీరలకు ఏపీలో మంచి గిరాకీ ఉంది. దీంతో చీరలు తయారు చేస్తూ అమలాపురానికి పంపిస్తున్నారు. రెండు నెలల కింద చీరల తయారీ ప్రారంభించాలని ఆలోచించిన వెంకటేశం తన వద్ద ఉన్న రూ. మూడు లక్షలకు తోడు మరో రూ. మూడు లక్షలు అప్పు తీసుకొని ఎనిమిది జపాన్ లూమ్స్ తెప్పించి ఇంటి వద్ద బిగించాడు. బెంగళూర్ నుంచి యారన్ తెప్పించుకుంటూ 100 శాతం కాటన్ క్లాత్‌తో చీరల ఉత్పత్తి ప్రారంభించాడు. రోజుకు 250 మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేస్తున్నాడు. వీరే కాకుండా బీవైనగర్, రాజీవ్‌నగర్, చంద్రంపేటలోని కొందరు ఆసాములు తమ క్రియేటివిటీకి పని చెప్పి వస్త్ర వ్యాపారంలో దూసుకుపోతున్నారు.
‘బతుకమ్మ’ ఆర్డర్లతో కుదేలైన వస్త్ర పరిశ్రమ
బతుకమ్మ చీరల ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. ఈ ఆర్డర్లు లేకముందు సిరిసిల్ల వస్త్ర కార్మికులు సొంతంగా అత్యంత నాణ్యత కలిగిన బట్టను ఉత్పత్తి చేసేవారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు అప్పగించింది. నవ్యత, నాణ్యత పాటించకుండా నాసిరకమైన బట్టతో బతుకమ్మ చీరలను తయారు చేయించింది.
ఆరేండ్లు బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడంతో కార్మికులు తమ సొంత పనిని వదిలేసి చీరల ఉత్పత్తిలో నిమగ్నమయ్యారు. ఈ ఆర్డర్ కారణంగా తాత్కాలిక ఉపాధి దొరికినప్పటికీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మాత్రం తన శాశ్వత ఉపాధిని కోల్పోయింది. ప్రస్తుతం బతుకమ్మ చీరల ఆర్డర్లు లేకపోవడం, సొంత పని చేసుకోలేకపోవడంతో కార్ఖానాలు మూతపడుతున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం సొంతంగా మార్కెటింగ్ చేసుకోలేని స్థితికి దిగజారింది.
వినూత్నంగా ఆలోచిస్తేనే నిలబడతాం
అందరూ ఒకేరకమైన బట్టను ఉత్పత్తి చేస్తే డిమాండ్ ఉండదు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడడంతో నేనే సొంతంగా ర్యాపియర్లు కొని టవల్స్ ఉత్పత్తి చేస్తున్నా. బల్క్ ఆర్డర్లు కూడా వస్తున్నాయి. టవల్స్‌తో పాటు లుంగీలు, బెడ్‌షీట్స్ కూడా తయారు చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెటింగ్ చేసుకుంటున్నా. ఆర్డలు లేవని ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. సరికొత్తగా ఆలోచిస్తేనే మార్కెట్‌లో నిలబడగలం. -అల్వాల సత్యానారాయణ, సాంచాల యజమాని