సిరిసిల్ల ‘సెస్’ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. వివిధ రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఇవాళ మీడియాలో దీనిపై వాడివేడి చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఏమిటీ ‘సెస్’ ? ఎందుకీ ఎన్నికలు ? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన పలు వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
సెస్ అంటే ?
‘సెస్’ అంటే.. సహకార విద్యుత్ సరఫరా సంఘం. దీన్ని 1970 నవంబరు 1న చెన్నమనేని రాజేశ్వరరావు సిరిసిల్లలో ప్రారంభించారు. సభ్యుల వాటాధనంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సిరిసిల్ల సెస్ తరహాలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 సెస్ లు ఏర్పాటయ్యాయి. ట్రాన్స్ కో నుంచి విద్యుత్ ను కొని తమ పరిధిలోని వినియోగదారులకు విక్రయించడమే సెస్ ల పని. కాలక్రమేణా ఆ సెస్ లు అన్నీ విద్యుత్ పంపిణీ బోర్డుల్లో విలీనమయ్యాయి. కానీ సిరిసిల్ల ‘సెస్’ మాత్రం సహకార సంస్థగా తన మనుగడను నిలుపుకోగలిగింది. అందుకే విద్యుత్ సరఫరా రంగంలో.. గ్రామీణ విద్యుద్దీకరణలో సిరిసిల్ల సెస్ కు అంత గొప్ప పేరు వచ్చింది. సిరిసిల్ల సెస్ ట్రాన్స్ కో నుంచి ఏటా దాదాపు 926 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొంటోంది. ప్రారంభమైన కొత్తలో సిరిసిల్ల సెస్.. సిరిసిల్ల ప్రాంతంలోని 46 గ్రామాలకు, 4,720 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేది. ఇప్పుడు ఏకంగా 2.72 లక్షల మంది వినియోగదారులు సిరిసిల్ల సెస్ కు ఉన్నారు. ప్రస్తుతం సెస్ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. 13 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీలకు ఇది విద్యుత్ సరఫరా సేవలు అందిస్తోంది. 2022 నవంబరు 1న సెస్ 53 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
సెస్ ఓటర్లు ఎవరు ?
సిరిసిల్ల విద్యుత్ సరఫరా సంఘం పరిధిలో విద్యుత్ మీటర్లు ఉన్నవాళ్లంతా ఓటర్ల కిందికే వస్తారు. ఈ లెక్కన సిరిసిల్లలోనే 66వేల కనెక్షన్లు ఉండగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2 లక్షల మందికిపైగా వినియోగదారులు ఓటర్లుగా ఉన్నారు. ప్రతి ఐదేండ్లకోసారి వీరంతా ఓట్లేసి సిరిసిల్ల సెస్ పాలకవర్గాన్ని ఎన్నుకుంటుంటారు.
ఈ ఎన్నిక నేపథ్యం ?
బోయినిపల్లి మండలానికి చెందిన దోర్నాల లక్ష్మారెడ్డి చైర్మన్‌గా ఉన్న సెస్పాలకవర్గ పదవీకాలం 2021 ఫిబ్రవరిలో ముగిసింది. అయితే సర్కారు మరో ఏడాది పొడిగిస్తూ అప్పుడే ఉత్తర్వులిచ్చింది. ఏమైందో ఏమోకానీ, వారం రోజుల్లోనే పాలకవర్గాన్ని రద్దు చేసి కలెక్టర్‌ను పర్సన్ఇన్చార్జీగా నియమించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి కోర్టుకు వెళ్లారు. ఆ కేసులో ఇంతవరకు ఎలాంటి తీర్పు రాలేదు. ఇంతలోనే మళ్లీ నామినేటెడ్ కమిటీని నియమిస్తూ సర్కారు ఆర్డర్ ఇచ్చింది. సెస్ కు ఎన్నికలు నిర్వహించకుండానే గుడూరి ప్రవీణ్ ను పర్సన్ ఇన్చార్జిగా, పలువురు డైరెక్టర్లను నియమిస్తూ 2022 ఏప్రిల్ 18న జీఓ జారీ చేశారు. అయితే ఈ జీఓ ను సవాలు చేస్తూ కనకయ్య హై కోర్టును ఆశ్రయించారు. దీంతో సెస్ కు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆగస్టు 25న తీర్పు వెలువరించింది. ఈనేపథ్యంలోనే డిసెంబరు 24న (శనివారం) సెస్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ రాత్రికల్లా దాని ఫలితం తేలిపోతుంది.