ఉత్పత్తి ప్రారంభమైనా.. కూలీ ఖరారు కాలే..

ఉత్పత్తి ప్రారంభమైనా.. కూలీ ఖరారు కాలే..
  • మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ఆర్డర్‌‌‌‌ను సిరిసిల్లకు ఇచ్చిన ప్రభుత్వం
  • కూలీ ఖరారు చేయకపోవడంతో ఆందోళనకు దిగిన కార్మికులు
  • మూడు రోజులుగా నిరవధిక సమ్మె.. మూగబోయిన సాంచాలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల పవర్‌‌‌‌లూం కార్మికులు ఆందోళన బాట పట్టారు. చీరల ఉత్పత్తికి ఆర్డర్‌‌‌‌ ఇచ్చిన ప్రభుత్వం.. కూలీ రేట్లు మాత్రం నిర్ణయించకపోవడంతో ఈ నెల 1 నుంచి సాంచాలు బంద్‌‌‌‌ చేసి నిరవధిక సమ్మెకి దిగారు. ఇందులో భాగంగా ప్రతిరోజు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల కూలీ రేట్లు నిర్ణయించాలని, గతంలో బతుకమ్మ చీరలు ఉత్పత్తికి ఎంత కూలీ ఇచ్చారో.. ఇప్పుడు కూడా అంతే ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.

ఉత్పత్తి ప్రారంభమైనా.. డిసైడ్‌‌‌‌ కాని కూలీ

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌‌‌‌ కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం 4.24 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలని జనవరి మూడోవారంలో సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్‌‌‌‌ ఇచ్చింది. దీంతో మ్యాక్స్‌‌‌‌ సంఘాల యజమానులు ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. అయితే కూలీలకు ఇవ్వాల్సిన రేటును మాత్రం ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు.

బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన టైంలో మీటర్‌‌‌‌ క్లాత్‌‌‌‌పై కూలీగా రూ. 5.25, యారన్‌‌‌‌ సబ్సిడీ కింద మరో రూ. 1.42 కలిపి మొత్తం రూ.6.67 కార్మికుల అకౌంట్లలో జమ చేసేవారు. కానీ ప్రస్తుతం రేటు నిర్ణయం కాకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం రేటు నిర్ణయించే వరకు కార్మికులు పనిలోకి రారని కార్మిక సంఘాల లీడర్లు స్పష్టం చేస్తున్నారు.

పెండింగ్‌‌‌‌లోనే యారన్‌‌‌‌ సబ్సిడీ

సిరిసిల్ల నేతన్నలతో బతుకమ్మ చీరలను తయారు చేయించిన గత ప్రభుత్వం కార్మికులకు మెరుగైన కూలీతో పాటు యారన్‌‌‌‌ సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కానీ చీరల బకాయిలు రూ. 370 కోట్లతో పాటు 2023 సంవత్సరానికి సంబంధించిన యారన్‌‌‌‌ సబ్సిడీని సైతం పెండింగ్‌‌‌‌లో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ చీరల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తూ వచ్చింది. ప్రస్తుతం చీరల బకాయిలు పూర్తిగా చెల్లించినా.. 2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ మాత్రం పెండింగ్‌‌‌‌లోనే ఉంది. ఒక్కో మీటరు క్లాత్‌‌‌‌ ఉత్పత్తిపై కార్మికుడికి రూ.1.42 చొప్పున చెల్లించాలి. ఒక్కో కార్మికుడు ఎన్ని మీటర్లు ఉత్పత్తి చేశాడో లెక్కగట్టి అన్ని డబ్బులు అతడి అకౌంట్‌‌‌‌లో డిపాజిట్‌‌‌‌ చేయాలి. సిరిసిల్లలో దాదాపు 4,500 మంది కార్మికులు బతుకమ్మ చీరల ఉత్పత్తిలో పాల్గొనగా.. వీరికి రూ. 6 కోట్ల వరకు రావాల్సి ఉంది.

ప్రభుత్వమే కూలీ నిర్ణయించాలే 

రాష్ట్రంలోని సెల్ఫ్‌‌‌‌ హెల్ప్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ మహిళలకు ఇచ్చే చీరల తయారీ ఆర్డర్‌‌‌‌ను ప్రభుత్వం సిరిసిల్లకు ఇచ్చింది. కానీ కార్మికులకు ఇచ్చే కూలీ ఇంకా ఖరారు చేయలేదు. బతుకమ్మ చీరలు తయారు చేసినప్పుడు ఇచ్చిన కూలీ కంటే తగ్గించి ఇస్తే ఊరుకోబోం. ప్రభుత్వం కూలీ నిర్ణయించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతాం. ప్రభుత్వం స్పందించి మీటర్‌‌‌‌ వస్త్రానికి ఎంత కూలీ ఇస్తుందో చెప్పాలి. - మూషం రమేశ్‌‌‌‌, పవర్‌‌‌‌లూం వర్కర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ స్టేట్‌‌‌‌ ప్రెసిడెంట్