మునుగోడులోనే తిష్ట వేసిన సిరిసిల్ల జెడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ప్రలోభాలు, ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. విచ్చలవిడిగా డబ్బు, లిక్కర్ పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చాలా చోట్ల టీఆర్ఎస్ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. ఈనెల 1వ తేదీన ఎన్నిక ప్రచారం ముగియగానే నాన్ లోకల్ లీడర్స్ అందరూ మునుగోడు నియోజకవర్గం విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. 

ఇవాళ పోలింగ్ రోజు కూడా చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మునుగోడు నియోజకవర్గంలోనే ఉండి.. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చండూరు, మర్రిగూడెం మండలాల్లో కొంతమంది టీఆర్ఎస్ నేతల ఇండ్లల్లో మకాం వేసిన ఆపార్టీ నాన్ లోకల్ లీడర్స్ ను బీజేపీ నేతలు పట్టుకుని ప్రశ్నించారు. మెదక్, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతలు బీజేపీ నేతలు, కార్యకర్తలకు పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే సిరిసిల్లా జిల్లా  జెడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు చండూరులో ఉన్నట్లు బీజేపీ నాయకులు గుర్తించారు. 

మరోవైపు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాల్లో వారి అనుచరులు డబ్బులు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే విషయంపై  నిన్న ధర్నా కూడా చేశారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరితో ఫోన్ లోనూ మాట్లాడారు. అలాంటిదేమీ లేదని ఎస్పీ సమాధానమిచ్చారు. కానీ, ఇవాళ పట్టుబడుతున్న నగదు, టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ ఇదంతా చూస్తుంటే పోలీసులు, ఎన్నికల సంఘం విఫలమైనట్లే అని బీజేపీ నేతలు అంటున్నారు.