
- మరో మూడు నియోజకవర్గాల్లో మూడు గ్రామాలు సైతం...
- లబ్ధిదారులకు ఓ వైపు ఫ్రీ కరెంట్, మరో వైపు అదనపు ఆదాయం
- 20 వేల ఫ్యామిలీలకు రూ. లక్షల్లో లబ్ధి
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా బోనకల్ మండలంతో పాటు మరో మూడు గ్రామాల ప్రజలకు త్వరలో ఫ్రీ సోలార్ విద్యుత్ అందనుంది. ‘సోలార్ మోడల్ విలేజ్’ స్కీమ్‌ను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బోనకల్ మండలంతో పాటు పాలేరు నియోజకవర్గంలోని చెరువు మాదారం, వైరా నియోజకవర్గంలోని శ్రీరామగిరి, మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో సోలార్ ప్యానెళ్లుఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడంతో ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల లబ్ధి చేకూరడమే కాకుండా, ఇండ్లతో పాటు వ్యవసాయ మోటార్లకు కూడా ఫ్రీ కరెంట్ అందనుంది.
ప్రజల తరఫున అప్లై చేయనున్న ఆఫీసర్లు
ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అందించేందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన’ పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ‘మోడల్ సోలార్ విలేజ్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకంలో వాస్తవానికి లబ్ధిదారుడే యూఎస్‌సీ నంబర్, ఆధార్, మొబైల్ నంబర్‌తో అప్లై చేసుకోవాలి. కానీ బోనకల్ మండలంతో పాటు మరో మూడు గ్రామాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ ఆఫీసర్లే గ్రామ ప్రజలందరి తరఫున ఆన్‌లైన్‌లో అప్లై చేయనున్నారు.
గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే
‘మోడల్ సోలార్ విలేజ్’ స్కీమ్ కింద ఎంపికైన గ్రామాల్లో ఆఫీసర్లు సర్వే స్టార్ట్ చేశారు. ఆయా గ్రామాల్లో మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి ? సోలార్ విద్యుత్ పరికరాలు అమర్చేందుకు రూఫ్‌టాప్‌లు అనుకూలంగా ఉన్నాయా ? వ్యవసాయ మోటార్ కనెక్షన్ల సంఖ్య ఎంత ? వాటి హార్స్ పవర్ ఎంత అనేది విద్యుత్ శాఖ ఆఫీసర్లు తేల్చనున్నారు. ఆయా కనెక్షన్లు ప్రస్తుతం నివసిస్తున్న వారి పేర్లపైనే ఉన్నాయా ? అనే వివరాలతో పాటు విద్యుత్ బిల్లుపై ఉండే యూఎస్‌సీ నంబర్, ఆధార్, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు. దాన్ని బట్టి కంపెనీల నుంచి టెండర్లను పిలిచి ఆయా గ్రామాల్లో ఉచితంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని చెరువు మాదారం, వైరా నియోజకవర్గంలో శ్రీరామగిరి, దాని అనుబంధ గ్రామమైన లచ్చగూడెంలో సర్వే జరుగుతుండగా, మధిర నియోజకవర్గం సిరిపురంలో ఇప్పటికే సర్వే పూర్తి చేశారు.
ఫ్రీ కరెంట్‌తో పాటు అదనపు ఆదాయం
లబ్దిదారుల ఇండ్లపై అందుబాటులో ఉన్న రూఫ్‌టాప్ ఏరియాను బట్టి కిలో వాట్ నుంచి మూడు కిలోవాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కిట్‌వాట్ ప్యానెల్స్ ద్వారా రోజుకు నాలుగు యూనిట్ల విద్యుత్ జనరేట్ అవుతుంది. మూడు కిలోవాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే రోజుకు 12 యూనిట్ల చొప్పున నెలకు యావరేజీగా 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కుటుంబ అవసరాలకు నెలకు 200 యూనిట్లు వాడుకున్నా మిగిలిన 160 యూనిట్లను గ్రిడ్‌కు అనుసంధానించి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. ఇందుకుగానూ యూనిట్‌కు రూ. 3.13 చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని వల్ల సదరు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల వరకు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. మీటర్లను గ్రిడ్‌కు అనుసంధానించేందుకు అవసరమైన బైడైరెక్షనల్ మీటర్లను కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయనుంది. సోలార్ ప్యానెళ్లను ఐదేండ్ల గ్యారంటీపై రెడ్కో సరఫరా చేయనుంది. వ్యవసాయ పంప్ సెట్లకు 5 హెచ్‌పీ మోటార్‌కు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానెళ్లను అమర్చుతారు.
వేల సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు
సిరిపురం గ్రామంలో 1,024 ఇంటి విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 510 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. చెరువు మాదారంలో 1,536 ఇంటి కనెక్షన్లు, 697 వ్యవసాయ మోటార్లు, శ్రీరామగిరిలో 204 ఇంటి, 68 మోటార్, లచ్చగూడెంలో 170 ఇంటి, 41 మోటార్, రఘునాథపాలెంలో 2,132 ఇంటి, 292 వ్యవసాయ మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. బోనకల్ మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉండగా 14,375 ఇండ్లు, 2,894 మోటార్ పంప్ సెట్ కనెక్షన్లు ఉన్నాయి.
20 వేల ఫ్యామిలీలకు లబ్ధి
మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ అమలుతో జిల్లాలో 20 వేల ఫ్యామిలీలకు లబ్ధి జరుగుతుంది. ఈ స్కీమ్ కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే చేస్తున్నాం. చనిపోయిన వారి పేర్ల మీద ఉన్న మీటర్ల నేమ్ ఛేంజ్ కూడా చేస్తున్నాం. ఈ స్కీమ్ కింద ఉచిత విద్యుత్‌తో పాటు ఫ్యామిలీలకు ఆదాయం కూడా అందనుంది.
-సురేందర్, ఎస్‌ఈ