చావునోట్లె తలకాయపెట్టి: ఫిబ్రవరి 20న తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి

చావునోట్లె తలకాయపెట్టి: ఫిబ్రవరి 20న తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి

‘‘చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఓ అనాథను నేను. అనాథాశ్రమమే నాకు అన్నీ నేర్పింది. ప్రత్యేక తెలంగాణ కోసం కొన్నేండ్లుగా పోరాటాలు జరుగుతున్నయ్.  వందల మంది ప్రాణాలు కోల్పోతున్నరు. తెలంగాణ కోసం నేనంటూ ఏదో చేయాలి!  నా ఆత్మార్పణతోనైనా ఓ  ముందడుగు పడుతుందని ఆశిస్తున్న..’’

.. ఇదీ 2010 ఫిబ్రవరి 20న  సిరిపురం యాదయ్య బ్యాగ్​లో దొరికిన నోట్ సారాంశం. కణకణ మండే అగ్గిని ముద్దాడుతూ.. ‘జై తెలంగాణ’ నినాదాలతో ఓయూ ఎన్సీసీ గేట్ ముందు సమైక్య సర్కారు బుల్లెట్లకు ఎదురొడ్డిన మిస్సైల్ యాదయ్య. ఇయ్యాల ఆ అమరుడి వర్ధంతి. ఈరోజు మనం స్వరాష్ట్రంలో సగర్వంగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది ముమ్మాటికీ.. చావునోట్లె తలపెట్టి ప్రాణాలర్పించిన సిరిపురం యాదయ్యలాంటి ఎందరో అమరుల త్యాగమే! వీరులారా.. వందనం!!

ఆరోజు యాదికొస్తే..!

2010 ఫిబ్రవరి 20.. ఆ రోజు యాదికొస్తే.. సిరిపురం యాదయ్య దేహం అగ్గిని అములుకున్నప్పటి ఆ కమురువాసనలు గుండెల్లో నిండి కండ్లపొంట ధార ఉబికివస్తది. నాడు ప్రత్యక్షంగా చూస్తూ నాటి నాతోటి స్టూడెంట్లతోపాటు, పరోక్షంగా ఆ దృశ్యాలను చూస్తూ ఎందరో ఉద్యమకారులు చలించిపోయారు.. రగిలిపోయారు. ఇగ తెలంగాణ ముచ్చట ఒడిసినట్టే అనే భ్రమలు సృష్టించిన సమైక్య పెత్తందార్లకు, వారి తొత్తు సీమాంధ్ర మీడియాకు ఉద్యమమంటే ఉత్తగ ఇడ్సిపెట్టేది కాదని.. లక్ష్యం సాధించేదాకా మరింత బలంగా దూస్కపోతమని యాదయ్య ఆత్మార్పణను చూసి యావత్ తెలంగాణ చాటిచెప్పింది. 

‘చలో అసెంబ్లీ’ పిలుపుతో..!

ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటంపై నాడు కొందరు బడాబాబులు కుట్రల కత్తులు దూస్తూ.. సమైక్య ఉద్యమమంటూ కల్పిత కథలకు తెరలేపారు. నలుగురైదుగురికి రంగులద్ది.. రోడ్ల మీదికి పంపి.. తమ చెప్పుచేతల్లో ఉన్న  మీడియాలో త్రీడీలో చూపెట్టడం మొదలుపెట్టారు.  వచ్చిన తెలంగాణ ప్రకటనపై విషం చిమ్మారు. అప్పటికే యుద్ధభూమిని తలపిస్తున్న ఓయూ.. ఆ  సమైక్య కుట్రల కత్తులపై జంగ్​ సైరన్​ మోగించాలని నిర్ణయించుకున్నది. 2010  ఫిబ్రవరి 19న.. రేపు ‘చలో అసెంబ్లీ’ అంటూ పిలుపునిచ్చింది. ఆ పిలుపునందుకున్న తెలంగాణ నలుమూలల నుంచి విద్యార్థులు అదే రాత్రి ఓయూ క్యాంపస్ పరిసరాల్లోకి చేరుకున్నరు. ఒడ్డెర బస్తీ, తార్నాక, రాంనగర్, విద్యానగర్, డీడీ కాలనీ, అశోక్​నగర్​లో తెలిసినవాళ్ల దగ్గర తలదాచుకున్నరు. 

ఫిబ్రవరి 20న ఉదయం పది గంటలకు.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందట ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేం ఉండేది.. ఓయూ ఎంట్రెన్స్  (ఎన్సీసీ గేటు) దగ్గరున్న త్రివేణి హాస్టల్లో. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీ ప్రారంభమయ్యే ముందే.. మా హాస్టల్లోని స్టూడెంట్లతోపాటు హాస్టల్ వర్కర్స్ కూడా తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మలు తయారు చేసి రెడీగా ఉంచుకున్నం. ఇటు ఓయూ ఎంట్రెన్స్ గేటు ముందు భారీగా పోలీసులు.. చేతుల్లో లాఠీలు, రబ్బరు బుల్లెట్లు, పక్కన టియర్ గ్యాస్ బండ్లతో బార్డర్​ను తలపించే రీతిలో రెడీగా ఉన్నరు. అప్పటివరకు ‘చలో అసెంబ్లీ’కి కలిసి నడుస్తామన్న రాజకీయ పార్టీల జెండాలు చల్లబడ్డయ్.. కానీ, తెలంగాణ ఎజెండాను ఎత్తుకున్న విద్యార్థి లోకం మాత్రం తగ్గలేదు. 

ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరింది. నినాదాలు మార్మోగుతున్నాయి.. ఇటు గేటు వైపు నుంచి రబ్బర్ బుల్లెట్లు, టియర్​ గ్యాస్​తో పోలీసులు దూసుకొచ్చారు. అయినా స్టూడెంట్లు పట్టువదలలేదు. మా హాస్టల్ కూడా మొత్తం కదిలింది. ఆ బుల్లెట్లను ఎదురొడ్డి.. ఓయూ ఎంట్రెన్స్ దగ్గరికి భారీగా స్టూడెంట్లమంతా చేరుకున్నం. గేటు అవతల కూడా అప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్లు ఉన్నరు. ఇనుప కంచెలను తోసుకుంటూ ముందుకు సాగింది ర్యాలీ!! పోలీసుల రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్​ను భారీగా వదలడంతో కండ్ల మంటలు, కాళ్లకు దెబ్బలతో తాళలేక స్టూడెంట్లమంతా మళ్లీ ఓయూ లోపలికి పోయి చెట్ల పొదల్లో, హాస్టళ్ల రూముల్లో తలదాచుకున్నాం. ఇంతలో ఓ అరుపు.. ‘‘అన్నా.. మన హాస్టల్​కు అవతల గవర్నమెంట్ స్కూల్  గోడ కాడ ఓ పిల్లగాడు అగ్గిపెట్టుకున్నడే” అని!!

లాఠీలూ కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశం

ఆ అగ్గికీలలతోనే పిడికిలెత్తి ‘‘జై తెలంగాణ”నినాదాలు చేస్తూ.. ఇనుప కంచెలను తోసుకుంటూ.. పోలీసులను దాటుకుంటూ.. అటూ ఇటు ఉరికిండు ఆ పిల్లగాడు. జోరబొంతలు, ఇసుక.. ఏది దొరికితే దానితోటి.. మంటలను ఆర్పిందుకు, ఆ పిల్లగాడ్ని కాపాడేందుకు స్టూడెంట్లు ప్రయత్నించారు. కొందరు పోలీసులు కూడా సహకరించారు. మంటలు ఆరిపోయాయి. కానీ, ఆ తమ్ముడు కాలిపోయిన మాంసపు ముద్దయిండు. అంతా కమురువాసన. అందరి గుండెలు ఆగినంత పనైంది! లాఠీలు కూడా కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశమది!! ఆ తమ్ముడికి ఇరవయ్యో, ఇరవై రెండో ఏండ్లు ఉండొచ్చు. తనే ‘సిరిపురం యాదయ్య’’.  బ్లాక్​ బ్యాగ్​ను వెనుకాల భుజాలకు తగిలించుకొని.. అప్పటి వరకూ మా మధ్యనే తిరిగిండు.. మాతోపాటే గొంతెత్తిండు.. ముళ్ల కంచెలను ఎత్తిపారేసేందుకు ప్రయత్నించిండు. కానీ, అంతలోనే చావునోట్లో తలపెట్టిండు. 

మంటల్లో నిలువెల్లా కాలుతూ, రోడ్డు మీద పడిపోతూ యాదయ్య చేసిన నినాదాలు యాదికొస్తే.. కన్నీళ్లు ఆగవు!! తన  బ్యాగ్​లో వెతికితే రెండు ఫొటోలు, ఓ నోట్ దొరికింది. ఒక ఫొటో కేసీఆర్​తో యాదయ్య దిగినప్పటిది, రెండోది అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో దిగినప్పటిది.  ‘‘తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తున్న” అంటూ నోట్​లో ఉంది.  పక్కనే కూతవేటు దూరంల గాంధీ దవాఖాన, డీడీ హాస్పిటల్ ఉన్నప్పటికీ.. అటువైపు తరలించకుండా పైనుంచి వచ్చిన ఆర్డర్స్​తో కావొచ్చు, స్టూడెంట్లకు మస్కా కొట్టి ఆగమాగంగా యాదయ్యను  సైదాబాద్ దగ్గర్లోని దవాఖానకు పోలీసులు తీసుకపోయారు. 

ఓయూ స్టూడెంట్లను క్యాంపస్ దాటి బయటకు రాకుండా నిర్బంధించారు. కొన్ని గంటలకు యాదయ్య అమరుడైండన్న వార్త వచ్చింది!!  అటు నుంచి అటే పోలీసులు భారీ బందోబస్తు నడుమ నాగారానికి యాదయ్య డెడ్​ బాడీని తీసుకపోయి ఖననం చేశారు. అట్లనే తెలంగాణ ఉద్యమాన్నీ బొందపెట్టాలనుకున్నరు. కానీ.. అవన్నీ తలచుకొని ఉద్యమం మరింత ఉవ్వెత్తున లేచింది.. స్వరాష్ట్ర కల సాకారమైంది.  

కేసీఆర్​, యాదయ్య బర్త్​డే ఒకే రోజు.. కానీ..!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాగారానికి చెందిన సిరిపురం యాదయ్య.. ‘చలో అసెంబ్లీ’ పిలుపునందుకొని నాడు ఓయూకు వచ్చిండు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షపై అటు సమైక్య వాదులు.. ‘చలో అసెంబ్లీ’ని ఆపాలని ఇటు కొందరు మనవాళ్లే చేసిన ప్రయత్నాలకు రగిలిపోయి, అందరి కండ్ల ముందే మాంసం ముద్దయిండు. తెలంగాణ ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున లేవాలని, తెలంగాణ కల సాకారం కావాలని ఆ అమరుడు కడశ్వాస వరకూ ఆశించిండు. 

ఉద్యమం లేచింది.. తెలంగాణ వచ్చింది. కానీ, తను లేడు!! స్వరాష్ట్రం సిద్ధించి దశాబ్దం కూడా దాటిపోయింది. పదేండ్లు పాలించిన గత పాలకులకు, ఇప్పటి పాలకులకు యాదయ్య యాదికున్నడా?!  సిరిపురం యాదయ్య పుట్టింది 1989 ఫిబ్రవరి 17న. ‘చావునోట్లె తలకాయపెట్టి తెలంగాణ సాధించిన’ అని చెప్పుకునే కేసీఆర్​ పుట్టినరోజు కూడా ఫిబ్రవరి 17ననే. స్వరాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్నన్నాళ్లూ, మొన్నటికి మొన్న కూడా కేసీఆర్  బర్త్​డే సెలబ్రేషన్స్​ గ్రాండ్​గా జరిగాయి. అదే రోజు సిరిపురం యాదయ్య జయంతి అని కేసీఆర్​కు కానీ, ఆయన అనుచరులకు కానీ గుర్తుంటె బాగుండు. ఒక్క పువ్వైనా ఆ అమరుడి ఫొటో ముందు ఉంచితే బాగుండు! ఎందుకంటే.. యాదయ్య తుదిశ్వాస విడిచే రోజు తన వెంట తెచ్చుకున్న రెండు ఫొటోల్లో ఒకటి కేసీఆర్​దే!! 

ఓయూ ఎంట్రెన్స్ దగ్గర యాదయ్య విగ్రహం కోసం..

తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలర్పించి ఇయ్యాల్లటికి పదిహేనేండ్లు. ఆ అమరవీరుడి విగ్రహాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రెన్స్  దగ్గర ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల నుంచి బలమైన డిమాండ్  వినిపిస్తున్నది. ఎక్కడైతే యాదయ్య ఆత్మార్పణ చేసుకున్నడో.. అక్కడే విగ్రహం ఏర్పాటు చేస్తే ఆ అమరుడి చరిత్ర అందరికీ తెలుస్తుందంటున్నరు. కొన్నేండ్లుగా ఏటా ఫిబ్రవరి 20న ఓయూ ఎంట్రెన్స్​ వద్దకు కొందరు ఉద్యమకారులు చేరి యాదయ్యను యాదిజేసుకుంటున్నరు. 

ఎవరొచ్చినా రాకున్నా.. ఒక ఫొటో పెట్టి నాటి ఆత్మార్పణ సన్నివేశాన్ని తలచుకొని.. చమర్చిన కండ్లతో.. భవిష్యత్తు తెలంగాణ ఎట్ల ఉండాలో చర్చించుకుంటున్నరు. ప్రజాపాలన అని చెప్పుకునే ప్రస్తుత ప్రభుత్వమైనా చొరవచూపి ఓయూ ఎంట్రెన్స్​ (ఎన్సీసీ గేట్​) వద్ద సిరిపురం యాదయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. తొలిదశ పోరులో, మలిదశ పోరులో చావునోట్లె తలకాయ పెట్టి నిండు ప్రాణాలర్పించిన ఎందరో అమరవీరుల త్యాగాలను చరిత్ర పుటలకెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తరతరాలకు వారి త్యాగాలు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లోనూ కొన్ని పేజీలు కేటాయించాల్సిన అవసరం ఉంది. 
- అంబట్ల రవి