చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు చరిష్మా(4). రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బొల్లె ఇసాక్, రూపా దంపతుల కూతరు. మూడు రోజుల క్రితం చరిష్మా ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చరిష్మాను కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. మున్సిపల్, జీపీ సిబ్బంది కుక్కల బర్త్ కంట్రోల్ చర్యలు తీసుకోకపోవడంతో విపరీతంగా పెరిగినట్లు ప్రజలు చెబుతున్నారు.
రాజన్న సిరిసిల్ల, మెట్పల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా మెట్పల్లి తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ఒంటిరిగా వచ్చే వారిపై దాడి చేస్తున్నాయి. గతంలో కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు తీసుకునే అధికారులు ఇప్పుడు పట్టించుకోకపోవడంతో కుక్కల సంతతి విపరీతంగా పెరిగింది.
వేల మందికి కుక్కకాటు..
రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా మెట్పల్లి తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా గత రెండు నెల్లలో 474 మంది కుక్కకాటుకు బలవగా,
నాలుగేండ్ల నుంచి 13,110 మంది కుక్కకాటుకు గురైనట్లు హాస్పిటల్సిబ్బంది తెలిపారు. మెట్ పల్లిలో 50 రోజుల్లో 224 మందిని కుక్కలు కరిచినట్లు హాస్పిటల్ లెక్కలు చెబుతున్నాయి. మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెల్లుల్ల రోడ్డు, కళానగర్, సుల్తాన్ పుర, ముస్లింపుర, బర్కత్ పుర, చైతన్య నగర్, టీచర్స్ కాలనీ, ఇందిరా ప్రియదర్షిని కాలనీ, అరపేట, గాజులపేట ఏరియాల్లో రాత్రీ పగలు అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 35 మంది చిన్నారులు, 99 మంది పెద్దలు, ఫిబ్రవరిలో 25 మంది చిన్నారులు, 78 మంది పెద్దలను కుక్కలు కాటేయడంతో మెట్ పల్లి సర్కార్ఆస్పత్రిలో చికిత్స పొందారు.
చర్యలు శూన్యం..
ఉదయం వాకింగ్ కు వెళ్లేవారు, స్కూల్ కు వెళ్లే చిన్నారులు, బైకులపై వెళ్లే వారిని కుక్కలు వెంటపడి తరుముతున్నాయి. కుక్కలు దాడి చేస్తూ వేల మందిని కాటేస్తున్నా మున్సిపల్అధికారులు చర్యలు తీసుకోకపోవడంలేదని, కుక్కలకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు వేయడం, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ద్వారా జనాభా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని బాధితులు విమర్శిస్తున్నారు.
పిల్లలపై దాడి చేస్తున్నాయ్
మెట్ పల్లి పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైంది. రోడ్డుపై వెళ్తున్న చిన్నారులు, పెద్దలపై దాడి చేస్తున్నాయి. పనికి వెళ్లేటపుడు, రాత్రి పూట ఇంటికి వచ్చేటపుడు కుక్కలు వెంట పడుతున్నాయి. వందల సంఖ్యలో పిల్లలు, పెద్దలు గాయపడుతున్నా బల్దియా అధికారులు పట్టించుకుంటలేరు.
- ఖుతుబొద్దీన్ పాషా, మర్కజీ ఇంతెహామీ కమిటీ అధ్యక్షుడు, మెట్ పల్లి
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో కుక్కకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కుక్కకాటుకు గురైన వారు నాటు వైద్యాన్ని నమ్మకుండా ఆసుపత్రిలో వ్యాక్సిన్లు వేయించుకోవాలి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సత్వర చికిత్స చేయాలని వైద్యులను ఆదేశించాం.
- సుమన్మోహన్ రావు,
డీఎంహెచ్ఓ, సిరిసిల్ల
చర్యలు చేపడతాం
సిరిసిల్ల పట్టణంలో వీధి కుక్కలను గుర్తించి నివారణకు చర్యలు చేపడతాం. సిరిసిల్ల డ్రై రీసోర్స్ పార్క్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ద్వారా కుక్కలకు వ్యాక్సిన్లు వేయిస్తాం. కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయిస్తాం.
- సమ్మయ్య,
మున్సిపల్ కమిషనర్