వీర్నపల్లి వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన గజ్జెల దిలీప్, శ్యామల దంపతుల చిన్న బిడ్డ నయన శ్రీ క్యాన్సర్‌తో పోరాడుతుందని తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ఆ కుటుంబానికి అండగా నిలిచారు. శుక్రవారం గ్రామంలోని చిన్నారి ఇంటికి వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ పాప తల్లిదండ్రులతో మాట్లాడారు. క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే రూ.3 లక్షలు అప్పు చేశారని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తహసీల్దార్, చిన్నారి తల్లి పేరు మీద జాయింట్ ఖాతా ఓపెన్‌చేసి అందులో రూ.10 లక్షలు జమ చేశారు. మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలనే అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని డీఎంహెచ్‌వో వసంతరావును ఆదేశించారు. మరిన్ని నిధులను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే తనకు ఫోన్ చేయాలన్నారు. ఇన్చార్జి తహసీల్దార్ మారుతీ రెడ్డి ఉన్నారు.