- కేకే మహేందర్ రెడ్డి, చీటీ ఉమేశ్‌రావు వర్గీయుల మధ్య టికెట్ వార్
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల కాంగ్రెస్ లో వర్గపోరు రచ్చకెక్కింది. డీసీసీ ఆఫీస్‌లో ఆదివారం నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్‌లో కేకే మహేందర్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టలేదని ఆయన వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పిడిగుద్దులతో ఆఫీసు రణరంగంగా మారింది. కేకే సొంత మండలం ముస్తాబాద్ లోని గూడెం గ్రామానికి చెందిన కొంత మంది కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిని తమకు తెలియకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని చీటీ ఉమేశ్ రావు వర్గీయులను కేకే వర్గమైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లే బాల్ రెడ్డి తదితరులు నిలదీశారు.
దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు కొట్టుకోవడంతో కొంత మంది కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మీటింగ్ క్యాన్సిల్ చేసి సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. కొంత కాలంగా ఈ రెండు వర్గాల మధ్య ఎమ్మెల్యే టికెట్ వార్ నడుస్తున్నది. ప్రెస్ మీట్‌కు వచ్చిన పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్గొడవపై కార్యకర్తలతో ఏం చర్చించకుండానే వెళ్లిపోయారు.