- జోరుగా డబ్బుల పంపకం
- సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం
సిరిసిల్ల/ వేములవాడ, వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలు శనివారం హోరాహోరీగా సాగాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలుకాగా.. 13 మండలాలతో పాటు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఉన్న 87,130 మంది ఓటర్లకు గాను 73,189 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల ఆఫీసర్లు తెలిపారు. 15 డైరెక్టర్ పోస్టుల కోసం జరిగిన ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఉదయం నుంచే ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. చోటా లీడర్లు ఓటర్ లిస్టులు పట్టుకుని డబ్బులు పంచినట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఒక్కో ఓటుకు రెండు వేల వరకు ఇచ్చినట్టు సమాచారం. ఓట్ల లెక్కింపు 26న వేములవాడలోని జూనియర్ కాలేజీలో జరుగనుంది.
కౌన్సిలర్ రాజీనామా
డబ్బుల పంపిణీ వ్యవహారం అధికార పార్టీలో చిచ్చు పెట్టింది. సిరిసిల్ల టౌన్టు నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్ తీరును నిరసిస్తూ సిరిసిల్ల మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ పత్తిపాక పద్మ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు కేటీఆర్‌కు లెటర్‌రాశారు. తన వార్డులో ఇతరులను ఇన్‌చార్జీలుగా నియమించి.. వారితో డబ్బులు పంచారని, ఇది తనను అవమానించడమేనని ఆమె వాపోయారు.
12 ఏండ్ల బాలుడికి ఓటు
తంగళ్లపల్లి మండలం నర్సింహుల పల్లె గ్రామంలో వేల్పుల రాంచరణ్ అనే 12 ఏండ్ల బాలుడు సెస్‌లో ఓటు వేశాడు. అతడు ఓటేసి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించేదాకా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సెస్ అధికారుల లోపం వల్ల తండ్రి ఓటు ఈ బాలుని పేరు మీద నమోదయ్యిందని, దాంతో బాలుడు ఓటేశాడని అంటున్నారు. అధికారులకు కంప్లైంట్ చేయగా బాలుని ఓటును ఇన్ వాలిడ్ చేయనున్నట్టు చెప్పారు.