అప్పుల ఊబిలో సిరిసిల్ల మున్సిపాలిటీ.. ఆదాయం రూ.10కోట్లు.. ఖర్చు రూ.12 కోట్లు

  • ఆదాయం రూ.10కోట్లు.. ఖర్చు రూ.12 కోట్లు
  • మొన్నటి దాకా ఆర్భాటాలకు ప్రాధాన్యమిచ్చిన పాలకవర్గం
  •  మూడేండ్లుగా ఖాళీగా 95 షాపులు 
  • వేలం వేస్తే రూ.కోటి వచ్చే చాన్స్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపాలిటీ క్రమంగా అప్పుల్లో కూరుకుపోతోంది. ఖర్చులకు తగ్గ.. రాబడి లేకపోవడంతో బల్దియా ఖజానా ఖాళీ అయింది. లోటు బడ్జెట్​తో సతమతం అవుతోంది. జిల్లాగా మారినప్పటి నుంచి సిరిసిల్లలో పారిశుద్ధ్యం, పార్కులు, స్ట్రీట్​లైట్ల నిర్వహణకు సరిపడా డబ్బు ఉండడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆదాయం పెంచే మార్గాలను పూర్తిగా గాలికి వదిలేశారు. హంగు, ఆర్భాటాలకే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించిన ప్రతిసారి మున్సిపాలిటీ పైసలనే ఖర్చు చేశారు. ఫలితంగా బల్దియాపై అదనపు భారం పడుతూ వచ్చింది. ఆదాయం రూ.10 కోట్లు ఉంటే.. ఖర్చు రూ.12 కోట్లకు చేరింది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా పాలక వర్గం, అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సెస్ కు రూ.1.50 కోట్లు బాకీ

మున్సిపల్​అధికారులు ఏడేండ్లుగా కరెంట్​బిల్లులు చెల్లించడం లేదు. మున్సిపల్​ఆఫీసుతోపాటు స్ట్రీట్​లైట్లు, పెండింగ్​బకాయిలన్నీ కలిపి సెస్​కు దాదాపు రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిల కోసం సెస్ నోటీసులు జారీ చేసినప్పుడల్లా మున్సిపల్​అధికారులు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. మొన్నటి దాకా బీఆర్ఎస్​ప్రభుత్వం ఉండడం, మాజీ మంత్రి కేటీఆర్​నియోజకవర్గం కావడంతో సెస్​అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ మారడంతోనే యాక్షన్​ప్లాన్​రెడీ చేశారు. బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చినా.. బల్దియా అధికారులు స్పందించకపోవడంతో రెండు రోజుల కరెంట్​సప్లయ్​కట్ చేశారు. ఒక రోజంతా మున్సిపల్ ఆఫీసుతోపాటు సిరిసిల్ల టౌన్​మొత్తం కరెంట్​నిలిచింది.

రూ.2 కోట్లు లోటు

మాజీ మంత్రి కేటీఆర్​అండతో మున్సిపల్ పాలకవర్గం, అధికారులు మొన్నటి దాకా హంగు, ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆదాయం రూ.10కోట్లు ఉంటే ఖర్చును రూ.12కోట్లకు చేర్చారు. మున్సిపాలిటీ ఆధీనంలోని షాపుల వేలం, ఇండ్ల పర్మిషన్లు, పన్నుల రూపంలో బల్దియా ఖజానాకు రూ.10 కోట్లు సమకూరుతున్నాయి. అయితే ఇందులో సిబ్బంది జీతాలు, పారిశుద్ధ్యం నిర్వహణ, బల్దియా వెహికల్స్​ఖర్చుకు రూ.6 కోట్లు ఖర్చు అవుతోంది. అధికారుల జీతాలు, ఇతర కార్యక్రమాలు కలిపి మొత్తంగా నెలకు రూ.12 కోట్ల వరకు ఖర్చు అవుతోంది.

ఖాళీగా 95 షాపులు 

2020లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానికంగా 175 షాపులు నిర్మించారు. 2021లో వేలం వేసి 83 షాపులను స్ట్రీట్​వెండర్లకు కేటాయించారు. మూడేండ్లుగా 92 షాపులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా వేలం వేసి స్ట్రీట్​వెండర్లకు కేటాయిస్తే మున్సిపాలిటీ ఆదాయం పెరిగే చాన్స్​ఉంది. కానీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం 83 షాపుల నుంచి రూ.80 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. మిగిలిన 92 షాపులను వేలం వేస్తే మరో రూ.కోటి వచ్చే వెసులుబాటు ఉంది.

ఆదాయం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాం

మున్సిపాలిటీ ఆదాయం బాగా తగ్గింది. పారిశుద్ధ్యంతోపాటు పార్కుల నిర్వహణకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. బల్దియా ఆధ్వర్యంలో నిర్మించిన స్ట్రీట్ వెండర్ల షాపులకు త్వరలోనే వేలం నిర్వహిస్తాం. వాటి నుంచి మరింత ఆదాయం వచ్చే చాన్స్​ఉంది. బస్టాండు బిల్డింగ్​పైఫ్లోర్ లోని కొన్ని షాపులను అద్దెకు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్​వల్ల మొన్నటి దాకా కొన్ని పనులు పెండింగ్​పడ్డాయి. బల్దియా ఆదాయం పెంచేందుకు ప్లాన్​చేస్తున్నాం. 

జిందం కళ, మున్సిపల్ చైర్ పర్సన్