హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హామీ ఇచ్చారు. ఎస్ఎఫ్సీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారి వరంగల్ కు వచ్చిన రాజయ్యకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మంగళవారం స్వాగతం పలికారు. కాజీపేట నుంచి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆ తరువాత హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల రాజయ్య మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఫైనాన్స్ కమిషన్ లేదని, ప్రజాస్యామ్నాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి, తనకు బాధ్యత అప్పగించారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వరంగల్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీసయ్యద్ రజాలి, వేముల శ్రీనివాస్, పోతుల శ్రీమాన్, తోట వెంకన్న, వీరగంటి రవీందర్, చీకటి ఆనంద్ పాల్గొన్నారు.