- 214 ఎకరాల్లో రూ.5.15కోట్లతో నిర్మాణం
- అన్ని వసతులు ఉన్నా పట్టించుకోని అమ్మకందారులు
- అధికారులు నచ్చజెప్పినా ఫలితం శూన్యం
- పాత మార్కెట్ లోనే క్రయవిక్రయాలు
రాజ్నన సిరిసిల్ల, వెలుగు: పట్ణణంలోని మానేరు తీరాన నిర్మించిన రైతు బజార్ క్రయవిక్రయాలు జరగక వెలవెలబోతోంది. రాష్ట్రంలోనే మోడల్ గా నిలుస్తుందని భావించిన రైతు బజార్ ను రైతులు వినియోగించకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తోంది. 2020 జూన్ 23న ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ మోడ్రన్ హంగులతో రైతు బజార్ ను ప్రారంభించారు. మొదట్లో మార్కెట్ కమిటీ నిర్వహణలో ఉన్న రైతు బజార్ ను తర్వాత మున్సిపల్ కు బదలాయించారు. పాత మార్కెట్ ను రైతు బజార్ కు తరలించడంలో మున్సిపల్ ఆఫీసర్లు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
214 ఎకరాల్లో 5.15 కోట్లతో నిర్మాణం
214 ఎకరాల్లో 5.15కోట్లతో రైతు బజార్ ను నిర్మించారు. పార్కింగ్ సమస్య లేకుండా వసతులు కల్పించారు. 38 కూరగాయల, 34 మాంసం విక్రయ దుకాణాలు నిర్మించారు. పండ్లు, పూలు అమ్ముకోవడానికి ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. కూరగాయలు పెట్టుకోవడానికి గద్దెలు నిర్మించారు. వినియోగదారులు, రైతులకు ఉపయోగపడేవిదంగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని సౌకర్యాలు కల్పించినా రైతులు మాత్రం వీటిని వినియోగించుకోవడం లేదు.
అధికారుల ప్రయత్నాలు విఫలం..
సిరిసిల్ల గాంధీచౌక్ దగ్గర ఉన్న పాత కూరగాయల మార్కెట్ ను రైతు బజార్ కు తరలించాలని మున్సిపల్ ఆఫీసర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రైతులు రైతు బజార్ కు షిఫ్ట్ కావడానికి సుముఖత చూపడం లేదు. విక్రయదారులకు నోటీసులు అందజేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో చేసేదిలేక మిన్నకుంటున్నారు. గాంధీనగర్ నుంచి రైతు బజార్ కు దూరం పెరుగుతుండడంతో ఇక్కడి ప్రజలు కూరగాయలు కొనేందుకు రావటంలేదని విక్రయదారులు వాపోతున్నారు. అలాగే రైతు బజార్ లో ఆశించిన రీతిలో అమ్మకాలు లేవని చెబుతున్నారు.
రూ.300 గిరాకీ కూడా అయితలేదు
సిరిసిల్ల రైతు బజార్ కు ఎవరూ వస్తలేరు. ఉదయం హోల్ సేల్ వ్యాపారమే ఎక్కవ నడుస్తతది. పొద్దుందాకా గిరాకీ ఉంటలేదు. రోజుకు రూ.300 గిరాకీ కూడా అయితలేదు. మార్కెట్ అంతా ఒకే జాగల ఉంటే మంచిగుండు. పాత మార్కెట్ లో కాయగూరలు అమ్ముకోనీకె జాగా దొరుకుతలేదు. పాత మార్కెట్ ను రైతు బజార్ కు తరలిస్తే మంచిగుంటది.
- నాగలక్ష్మి, చిరు వ్యాపారి