సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికలకు వేళాయే

  •     రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ
  •     వచ్చే నెల 6న పోలింగ్, అదే రోజు ఫలితాలు
  •     చైర్మెన్ స్థానం కోసం రాజకీయ పార్టీల వ్యూహాలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ కో- ఆపరేట్ బ్యాంకుల్లో ఒకటైన సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్​కు వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ తరహాలో పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే ఎన్నికలే అయినా ప్రధాన పార్టీలు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. పాలకవర్గ సభ్యులుగా గెలిచిన వారికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పావులు కదుపుతున్నాయి.  

వెయ్యి మందితో ప్రారంభమై.. 

ఇప్పటికే కో ఆపరేటివ్ ఆఫీసర్లు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా, రేపటి నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న స్క్రూటీని, 31న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని షెడ్యూల్​లో పేర్కొన్నారు. మొత్తం 6,177 మంది ఓటర్లు ఉన్న అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి సంబంధించి 12 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గెలుపు పొందిన వీరే.. చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. మొత్తం 12 స్థానాల్లో ఒకటి ఎస్సీ, ఎస్టీకి, రెండు మహిళలకు, మిగిలిన 9 స్థానాలను జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. 

ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి. ప్రస్తుత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సభ్యులకు సభ్యత్వ నంబర్​తో కూడిన గుర్తింపు కార్డులను బ్యాంకు అధికారులు జారీ చేస్తున్నారు. 1984లో కేవలం 1000 మంది ఖాతాదారులతో ప్రారంభమైన సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ .. ఇప్పుడు సుమారు 25 వేల మంది ఖాతాదారులు, 7 వేల మంది సభ్యత్వ భాగస్వాములను కలిగి ఉంది. 

అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్​కు చుక్కెదురు

2018లో జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పావులు కదిపింది. అప్పటి మంత్రి కేటీఆర్ అన్ని స్థానాలు గెలవాలని పార్టీ నాయకులకు సూచించారు. కానీ, 12 స్థానాలకుగానూ బీఆర్ఎస్ ప్యానల్​లో చాలా మంది ఓడిపోయారు. ఏ పార్టీ మద్దతు లేని అభ్యర్థులు గెలుపొందడంతో కేటీఆర్ షాక్​కు గురయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్​తోపాటు బీజేపీ కూడా ఈ ఎన్నికలకు సవాల్​గా తీసుకుంది.ఇప్పటికే కమలదళం తమ అభ్యర్థులను బరిలో ఉంచేందుకు సమావేశం నిర్వహించింది.