కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వాన్ని విమర్శించడం.. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తప్పుడు ప్రచారం చేయడం ప్రతిపక్ష నాయకులకు పరిపాటిగా మారిందని, వారికి అధికార దాహం తప్ప ప్రజలకు చేసింది, చేయబోయేది ఏమి లేదని సిర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప విమర్శించారు. ఆదివారం సిర్పూర్ తోపాటు కాగజ్ నగర్ మండలంలోని పెద్ద మాలిని గ్రామాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారికి ఆదివాసీ గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ఆ ఇద్దరూ ప్రజలతో మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి కోసం సిర్పూర్ కు కొందరు నాయకులు వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను చేస్తున్నారని, నవంబర్ 30న ఓటుతో ప్యారచూట్ నాయకులను నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఅర్ఎస్ మ్యానిఫేస్టో, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను కోనప్ప ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.
బీఎస్పీ, బీజేపీ అభ్యర్థులు కేవలం కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. నియోజక వర్గ ప్రజలు అందరూ కలసి కట్టుగా ఉండడం తన తాపత్రయం అన్నారు..