తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష : కోనేరు కోనప్ప

కాగజ్ నగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని సిర్పూర్​ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప అన్నారు. ప్రతిపక్షాలకు అధికార దాహం తప్ప ప్రజలకు చేసింది, చేయబోయేది ఏమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన పెంచికల్​పేట్ మండల కేంద్రంతోపాటు మండలంలోని పోతేపల్లి, దరోగపల్లి ,చేడ్వాయి, ఎల్లూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. 

బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్యారచూట్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను చేస్తున్నారని ధ్వజమెత్తారు. నవంబర్ 30న ఓట్లతో ప్యారచూట్ నాయకులను సిర్పూర్ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.