- భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపణ
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ఎస్పీ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్న జాల మహేందర్ ఇద్దరు భార్యలు తమ పిల్లలతో సహా చనిపోయేందుకు అనుమతించాలంటూ అభ్యర్థించడం చర్చనీయాంశమైంది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని, తనని వేధింపులకు గురి చేస్తున్నాడని ఎస్ఐ భార్య జ్యోతి సోమవారం నల్గొండ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగింది. పిల్లలతో కలిసి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపింది. ప్రియురాలుతో కలిసి తన భర్త పలుమార్లు తనపై, పిల్లలపై హత్యాయత్నం చేశాడని ఆరోపించింది.
వివాహిత, ముగ్గురు పిల్లల తల్లి అయినా ఎక్సైజ్ కానిస్టేబుల్ తో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని పేర్కొంది. భర్త, అతడి ప్రియురాలు చేతిలో చనిపోయే దానికన్నా ఆత్మహత్యకు అనుమతి నివ్వాలంటూ ఫ్లెక్సీ తో నిరసన చేపట్టింది. భర్త మహేందర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు జ్యోతి అధికారులను వేడుకుంది. కాగా మహేందర్‌తో తనను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఈ విషయం భార్యతోపాటు కుటుంబ సభ్యులందరికీ తెలుసని అతడితో కలిసి ఉంటున్న వసంత చెప్పారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తన పిల్లలతో కలిసి మీడియాతో ఆమె మాట్లాడారు. మొదటి భర్తతో విడాకుల పొందిన అనంతరం మహేందర్ ను 2014 ఏప్రిల్ 12న పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయంతో ఆయన మొదటి భార్యతో గొడవ జరిగిందని, ఆమెకు పిల్లలు లేకపోవడంతో తమ వివాహాన్ని అంగీకరించిందన్నారు. ఆరేళ్ల తర్వాత జ్యోతికి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టారని, దీంతో తనను దూరంగా ఉండాలని మహేందర్‌పై ఒత్తిడి తెచ్చారన్నారు.
జ్యోతి ఫిర్యాదులతో 2016లో మహేందర్‌ను పైఅధికారులు ఆరు నెలలు సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. కావాలనే తనను, తన పిల్లలను వేధిస్తున్నారని ఆరోపించింది. వేధింపులకన్నా తాను, తన పిల్లలకు చనిపోయేందుకు అనుమతించాలని వసంత కోరారు.