రాఖీ పండుగకు వెళ్తూ అన్న కళ్లెదుటే చెల్లెలి మృతి

తల్లి ఇంటికి వెళ్తుండగా ఢీకొన్న లారీ

గోదావరిఖని, వెలుగు: రాఖీ పండుగ సందర్భంగా అన్నతో కలిసి తల్లిగారింటికి వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వివాహిత మృతిచెందింది. ఈ ఘటన గోదావరిఖని వద్ద శనివారం చోటుచేసుకుంది. జమ్మికుంట మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి కోటి హరికృష్ణ వివాహం ఏడాదిన్నర క్రితం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ బి‒జోన్‌‌కు చెందిన స్వప్న(25)తో జరిగింది. రాఖీ పండుగ సందర్భంగా స్వప్న తల్లి గారింటికి శనివారం బయలుదేరగా భర్త బైక్ మీద పెద్దపల్లి వరకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి స్వప్న సోదరుడు రాజేందర్‌ తన వెహికల్ పై తీసుకుని బి‒జోన్‌ బయలుదేరారు. గోదావరిఖనికి చేరుకునేసరికి వర్షం మొదలవడంతో బస్టాండ్‌ వద్ద కొంతసేపు ఉండిపోయారు. తిరిగి బయలుదేరిన క్రమంలో 10.30 గంటల సమయంలో జీఎం ఆఫీస్ సమీపంలోని మూలమలుపు వద్ద వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది. కిందపడిన స్వప్న పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. రాజేందర్‌‌కు స్వల్ప గాయాలయ్యాయి. పండుగ
నాడు తనకు రాఖీ కట్టడానికి వస్తున్న చెల్లెలు కళ్ల ముందే చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

శాంపిల్ తీసుకోకుండానే నెగెటివ్ గా మెసేజ్

మోహన్ బాబు ఫామ్ హౌస్ లో కలకలం

గరీబోళ్ల భూములే దొరికినయా సారూ..