‘మహిళలకు చదువు అందించి విద్యావంతులను చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది’ ఈ మాటను బలంగా నమ్మిన వ్యక్తి సిస్టర్ నివేదిత. తాను పుట్టిన దేశాన్ని వదిలి ఇండియాకు వచ్చి మహిళల చదువు, వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారామె. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ(ధర్మం) మతాన్ని స్వీకరించడమే కాదు.. ఆయన పిలుపు మేరకు ఇండియాకు వచ్చారు. తండ్రి చెప్పిన మాటలను నమ్మి కన్నుమూసే వరకూ సమాజ సేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు సిస్టర్ నివేదిత. అక్టోబర్ 28న ఆమె జయంతి.
సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజిబెత్ నోబెల్. 1867 అక్టోబర్ 28న ర్లాండ్‌లో పుట్టారు. తల్లిదండ్రులు మేరి ఇసబెల్, శామ్యూల్ రిచ్‌ముడ్ నోబెల్. తోటి మనుషులను కరుణతో చూడటమే భగవంతునికి నిజమైన సేవ చేయడమని చిన్నతనంలో తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. తండ్రి స్ఫూర్తిదాయకమైన మాటలతో ఒక పాఠశాలలో టీచర్‌గా చేరారు. దాదాపు పదేండ్లు(1884 నుంచి 1894 వరకు) టీచర్‌గా పనిచేశారు. 1895లో భారతదేశ ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్ జీవితాన్ని పూర్తిగా మార్చాయి. భారతీయత గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి తనకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. వివేకానందుని పిలుపు మేరకు 1898 జనవరి 28న ఇండియాకు వచ్చారు. ఆమెకు వివేకానంద నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేసినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ది మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరులపై దయా గుణంతో మెలిగే ఆమెకు సంగీతం, చిత్రకళలోనూ ప్రవేశం ఉంది.
చదువుతోనే బతుకు
టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత.. బాలికల విద్య కోసం 1898 నవంబర్‌లో కలకత్తాలోని బాగ్‌బజార్‌లో స్కూల్‌ను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రయత్నం చేశారు. అన్ని కులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆకాంక్షించారు. బెంగాల్ మహిళలతో, మేధావులతో పరిచయాలు పెంచుకుని బాలికల విద్య కోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, జగదీశ్ చంద్ర బోస్ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు. 1899 మార్చిలో కలకత్తాలో ప్లేగ్ మహమ్మారి వ్యాపించినప్పుడు తన శిష్యులతో కలిసి ప్రజలకు వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం, ఆచార వ్యవహారాల గురించి న్యూయార్క్ , షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు.
సేవలను కొనసాగించాలి
1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీయతను పుణికిపుచ్చుకుని స్వామి వివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో కన్నుమూశారు. ఆమె పేరుతో దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఇండియన్ల కోసం, అందులోనూ మహిళల అభ్యున్నతి కోసం చేసిన సేవలను సమాజంలో మరింత విస్తరించటమే సిస్టర్ నివేదితకు మనం అందించే నిజమైన నివాళి.-సామల కిరణ్, తెలుగు లెక్చరర్, కరీంనగర్
For MORE NEWS….