జగిత్యాలలో ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లెళ్లు

జగిత్యాలలో ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లెళ్లు
  • 100 గజాల స్థలంలో వాటా కోసం కట్టెలతో దాడి
  • జగిత్యాల పట్టణంలో దారుణం

జగిత్యాల రూరల్, వెలుగు : ఆస్తి కోసం ఇద్దరు చెల్లెళ్లు కలిసి అన్నను హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన జంగిలి బసవయ్యకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బసవయ్య పెద్ద కూతురు వరలక్ష్మి భర్త చనిపోవడంతో జగిత్యాలకు వచ్చి సోదరుడు శ్రీనివాస్‌‌ (52) ఇంటి పక్కన కిరాయికి ఉంటోంది. చిన్న కూతురు శారద కూడా తన భర్తను వదిలేసి జగిత్యాలలోనే ఉంటోంది. బసవయ్య తన పేరున ఉన్న 100 గజాల స్థలాన్ని శ్రీనివాస్‌‌కు ఇస్తానని చెప్పడంతో.. తమకూ వాటా ఇవ్వాలని వరలక్ష్మి, శారద కోర్టులో కేసు వేశారు. 

ఈ విషయంపై కొన్నేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం శ్రీనివాస్‌‌ తన తండ్రి బసవయ్య ఇంటికి వెళ్లగా... అక్కడే ఉన్న వరలక్ష్మి, శారద కలిసి కర్రతో శ్రీనివాస్‌‌పై దాడి చేశారు. తలకు తీవ్రంగా గాయం కావడంతో శ్రీనివాస్‌‌ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో జగిత్యాల టౌన్‌‌ పీఎస్‌‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు.