పీఎం, సీఎం సిస్టర్స్ మీటింగ్.. అనుకోకుండా విచిత్రం జరిగింది..

ప్రధాని నరేంద్ర మోదీ సోదరి వాసంతీబెన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిదేవి ఆగస్టు 4న ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లోని ఓ ఆలయంలో సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీ సోదరి వాసంతి బెన్ తన భర్తతో కలిసి సావన్ మాసంలో శివునికి ప్రార్థనలు చేసేందుకు గార్వాల్ ప్రాంతంలోని పౌరీలో ఉన్న నీలకంఠ మహాదేవ్ ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత కొఠారి గ్రామంలోని పార్వతి ఆలయాన్ని సందర్శించిన వాసంతి బెన్.. అక్కడ యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిదేవిని కలిశారు.

ఇలా వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం, పలకరించుకోవడం, వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నారు. అలా వారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న తర్వాత ఆలయం వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ షేర్ అవుతోంది.