గాంధీ ఆస్పత్రిలో దారుణం..అక్కాచెల్లెల్లపై అత్యాచారం

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ రోగికి సాయంగా వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఇద్దరు బాధితుల్లో ఒకరు ఇంటికి చేరుకున్నారు. కానీ మరో మహిళ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. హహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వేపురిగేరికి చెందిన కర్నె నర్సింహులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 4న హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు సాయంగా భార్య తిరుపతమ్మ, ఆమె చెల్లెలు సువర్ణ వెళ్లారు. నర్సింహులును వేరే వార్డుకు మార్చడంతో అది ఎక్కడో తెలియక అక్కాచెల్లెల్లు తికమకపడ్డారు. ఆ సమయంలో ఓపీ సెక్షన్‌లోని కంప్యూటర్‍ ఆపరేటర్‌ ఉమామహేశ్వర్‍ వార్డు చూపిస్తానని వారిని నమ్మించాడు.

ఇందులో భాగంగా  ఓ స్టోర్ రూంలోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తనపై సుమారు నలుగురు అత్యాచారం చేసినట్లు బాధితురాలు విలపిస్తోంది. బాధితులు ముందుగా మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కానీ గాంధీ ఆస్పత్రి పరిధిలోని పీఎస్‌కు వెళ్లాలని సూచించడంతో వారు మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఇంత దారుణం జరిగినా ఘటన బయటకు తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బంధవులు డిమాండ్ చేస్తున్నారు.