కిరాణా షాపుకు వెళ్లిన .. అక్కాచెల్లెళ్లు అదృశ్యం

కిరాణా షాపుకు వెళ్లిన .. అక్కాచెల్లెళ్లు అదృశ్యం

నాగర్​కర్నూల్/ నాగర్​కర్నూల్ ​టౌన్, వెలుగు: మేకలను కాసే అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లి12 రోజులు దాటుతున్నా ఆచూకీ దొరకడం లేదు. ఇద్దరు ఆడపిల్లల జాడ తెలియక తల్లడిల్లిన తల్లిదండ్రులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నాగర్​కర్నూల్​ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన బాలరాజు, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. కొడుకు గత ఏడాది రోడ్డు యాక్సిడెంట్​లో చనిపోయాడు. కూతుళ్లు భాగ్యవతి(16) 7వ తరగతి, హైమావతి(13) 4వ తరగతి వరకు చదివారు. సోదరుడి మరణంతో గత ఏడాది నుంచి మేకలు మేపేందుకు వెళ్తున్నారు. ఆగస్టు 20న రూ.20 తీసుకొని కిరాణ షాపునకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. 

తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు రెండు రోజుల పాటు వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో తమ పిల్లలకు ఏమైందోనని 22వ తేదీన బాలరాజు, లక్ష్మమ్మ ఇంట్లో పురుగుల మందు తాగారు. ఇంటి చుట్టుపక్కల వారు గమనించి దవాఖానకు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గత నెల 25వ తేదీన తెల్కపల్లి పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ ఇవ్వగా పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ  కేసు పురోగతిలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

శుక్రవారం బీఎస్సీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్, నియోజకవర్గ ఇన్​చార్జి  కుమార్​ గౌరారం వెళ్లి బాలికల తల్లిదండ్రులను కలిశారు. ఇద్దరు ఆడపిల్లలు కనపడకుండా పోతే పోలీసులు సీరియస్​గా తీసుకోకపోవడం దారుణమని అన్నారు. పేరెంట్స్​తో కలిసి అడిషనల్​ ఎస్పీ రామేశ్వర్​కు వినతిపత్రం అందజేశారు. కంప్లయింట్​ వచ్చిన వెంటనే స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ సతీశ్ చెప్పారు. సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఆచూకీ కనిపెడతామన్నారు.