
- జర్మనీ నుంచి అర్ధరాత్రి చేరుకున్న ఎంపీ
మ్యూనిచ్: బెంగళూరు సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇండియాకు తిరిగొచ్చారు. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి గురువారం సాయంత్రం బయలుదేరిన ఎంపీ.. బెంగళూరు కెంపెగౌడ ఎయిర్ పోర్టులో అర్ధరాత్రి ల్యాండయ్యారు. ప్రజ్వల్ కోసం ఎయిర్ పోర్టులో వేచి ఉన్న సిట్ అధికారులు ఎంపీని అదుపులోకి తీసుకున్నారు.
రాత్రి ఒంటిగంటకు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు.. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి వస్తున్నట్లు తెలియడంతో సిట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని కర్నాటక హోంమంత్రి జి.పరమేశ్వర నిర్ధారించారు. ప్రజ్వల్ ఎక్కిన విమానం జర్మనీలోని మ్యూనిచ్ నుంచి సాయంత్రం 4:10 గంటలకు (భారత కాలమానం) బయలుదేరిందని, బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు రాత్రి 12:30 గంటలకు చేరుకుంటుందని వివరించారు. దీంతో సిట్ అధికారులు పలు టీమ్లు గా ఏర్పడి గురువారం రాత్రి కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.