తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ ఇష్యూ ఆంధ్రప్రదేశ్‎తో పాటు యావత్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా నేషనల్, లోకల్ మీడియాతో పాటు సోషల్ మీడియా ఎక్కడ చూసిన ఈ టాపిక్‎పైనే చర్చ. ఎంతో ప్రవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న దానిపై కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

ALSO READ | తప్పని నిరూపిస్తే.. పవన్ బూట్లు తుడుస్తాం.. ప్రభుత్వానికి అంబటి సవాల్

ఈ క్రమంలో లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై లోతైన విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గుంటూరు రేంజ్‌ డీఐజీగా ఉన్న సర్వశ్రేష్ట త్రిపాఠిని  సిట్ చీఫ్‎గా నియమించారు. సిట్ సభ్యులుగా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు‌లను అపాయింట్ చేశారు. 

సర్వశ్రేష్ట త్రిపాఠి బృందం తిరుపతి లడ్డూ తయారీలో జరిగిన కల్తీ, దానికి బాధ్యులు ఎవరనే దానిపై లోతుగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆంధ్రప్రదేశ్‎తో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు సర్కార్ నెక్ట్స్ స్టెప్ తీసుకోనుంది. అసలు తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరగలేదని ప్రతిపక్ష వైసీసీ ఆరోపిస్తుండటంతో సిట్ ఎలాంటి నివేదిక ఇస్తుందోననే దానిపై ఉత్కంఠ నెలకొంది.