దూకుడు పెంచిన సిట్.. బెట్టింగ్ రాయుళ్ళ బెండ్ తీస్తున్న అధికారులు

దూకుడు పెంచిన సిట్.. బెట్టింగ్ రాయుళ్ళ బెండ్ తీస్తున్న అధికారులు
  • సిట్‌‌ ఏర్పాటుతో కదిలిన పోలీస్ యంత్రాంగం
  • ఆన్‌‌లైన్ గేమింగ్‌‌ గ్యాంగులపై డెకాయ్ ఆపరేషన్లు
  • బెట్టింగ్ రాయుళ్లనే ఎరగా వేసి పట్టేస్తున్నారు
  • లోకల్ ఏజెంట్ల నుంచి అంతర్రాష్ట్ర ముఠాల దాకా వేట
  • నిజామాబాద్​లో ఏడుగురు అరెస్ట్.. 9 మంది పరార్ 
  • ఆదిలాబాద్​లో ఇద్దరు అదుపులోకి 
  • వరంగల్​లో ఒకరు అరెస్ట్.. పరారీలో ఇద్దరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బెట్టింగ్‌‌ మాఫియాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన సిట్‌‌ దూకుడు పెంచింది. జిల్లాల వారీగా బెట్టింగ్‌‌రాయుళ్ల బెండు తీస్తోంది. గతంలో బెట్టింగ్, గేమింగ్‌‌ కేసుల్లో పట్టుబడిన వారినే ఎరగా వేసి డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీస్‌‌ యంత్రాంగాన్ని సిట్ అప్రమత్తం చేసింది. 

దీంతో హైదరాబాద్‌‌ సహా వరంగల్‌‌, నిజామాబాద్‌‌, సంగారెడ్డి జిల్లాల్లో పోలీసులు వరుస దాడులు నిర్వహించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో దందా నిర్వహిస్తున్న మూడు గ్యాంగులకు చెందిన 13 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 11 మంది కోసం గాలిస్తున్నారు. బెట్టింగ్‌‌ గ్యాంగుల వద్ద సేకరించిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని మెయిన్‌‌ గ్యాంగుల వివరాలను పోలీసులు రాబడుతున్నారు. ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌, గేమింగ్‌‌ ఆపరేటర్ల మూలాలను ట్రేస్ చేస్తున్నారు. గ్రేటర్‌‌ ‌‌హైదరాబాద్‌‌లో సట్టా, మట్కా నిర్వాహకులపై కూడా నిఘా పెట్టారు. 

బెట్టింగ్‌‌ దందా నెట్‌‌వర్క్‌‌ ఇలా..   

ఐపీఎల్ సహా ఇతర క్రికెట్ మ్యాచ్‌‌లు జరిగే సందర్భాల్లో అంతర్రాష్ట్ర ముఠాలు జోరుగా బెట్టింగ్‌‌ నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌‌, గుజరాత్‌‌ అడ్డాగా మెయిన్ గ్యాంగులు అన్ని రాష్ట్రాల్లో ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌ దందా నడిపిస్తున్నాయి. హైదరాబాద్‌‌లో ఇప్పటికే దాదాపు 25కు పైగా బెట్టింగ్‌‌ గ్యాంగులు యాక్టివ్‌‌గా పని చేస్తున్నాయి. 

ఈ గ్యాంగుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లు, సబ్‌‌ బుకీలు బెట్టింగ్‌‌ నిర్వహిస్తున్నారు. గతంలో తమ వద్ద రిజిస్టరైన బెట్టింగ్ రాయుళ్లకు వెబ్‌‌సైట్లు, ఇతర బెట్టింగ్ యాప్‌‌ లింకులు పంపిస్తున్నారు. కమీషన్ల ఆశ చూపి స్థానిక ఏజెంట్లుగా నియమిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌‌లో అనుభవం ఉన్న పంటర్లతో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయిస్తున్నారు. గతంలో నమోదైన ఇలాంటి కేసుల వివరాల ఆధారంగా బెట్టింగ్‌‌ ముఠాలను గుర్తించేందుకు సిట్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 

పంటర్లు, సోషల్‌‌ మీడియాపై నజర్‌‌‌‌ 

వెబ్‌‌సైట్లు, మొబైల్ యాప్స్, వాట్సప్‌‌ గ్రూపుల్లో పంటర్లు నిర్వహించే బెట్టింగ్ సమాచారం పోలీసులకు తెలిసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీన్ని చాన్స్​గా తీసుకున్న బెట్టింగ్ రాయుళ్లు.. పోలీసులకు చిక్కకుండా కోడ్ భాషలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అయితే, వీటిని గుర్తించేందుకు పోలీసుల పక్కా ప్లాన్ చేశారు. సోషల్‌‌ మీడియా మానిటరింగ్‌‌ టీమ్‌‌తో కలిసి గ్రూపులపై నజర్‌‌‌‌ పెట్టారు. 

ఈ క్రమంలోనే గ్రామీణ స్థాయిలో ప్లేకార్డ్స్‌‌, ఇతర జూదాలు నిర్వహించే ఆర్గనైజర్ల వివరాలను స్థానిక పోలీసులతో కలిసి సేకరిస్తున్నారు. హైదరాబాద్‌‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ బెట్టింగ్ కేసులు నమోదైన ప్రాంతాలను బెట్టింగ్ హాట్‌‌స్పాట్లుగా గుర్తించారు. ఇలాంటి ప్రాంతాలపై ఆయా జిల్లాల ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టుబడిన బెట్టింగ్ రాయుళ్ల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లు, సబ్‌‌ బుకీలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వరంగల్​లో ఒకరు అదుపులోకి 

వరంగల్‌‌ కమిషనరేట్‌‌ గీసుగొండ పీఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌‌కు పాల్పడుతున్న యాదగిరి గిరిధర్ అనే యువకుడిని గురువారం రాత్రి టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన దౌడు నితిన్, వంచనగిరి గ్రామానికి చెందిన కావటి రాకేశ్‌‌తో కలిసి ఆఫ్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. యాదగిరి గిరిధర్‌‌‌‌ నుంచి రూ.10,500 నగదు, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దౌడు నితిన్, కావటి రాకేశ్ పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నారు. 

 ఆదిలాబాద్​లో ఇద్దరు అరెస్ట్ 

ఆదిలాబాద్‌‌ జిల్లాలో వరుస ఘటనలతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల బెట్టింగ్ నిర్వహిస్తున్న సాయి కుమార్, షేక్ సాజిద్‌‌లను అరెస్టు చేశారు. క్రికెట్ 99 యాప్‌‌తోనే ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి బెట్టింగ్‌‌ల కారణంగా గతేడాది ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ టీచర్ రూ. లక్ష పోగొట్టుకున్నాడు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. 

జైనథ్ మండలంలో పిప్పర్ వాడ గ్రామానికి చెందిన ఓ యువకుడు గత జనవరిలో ఆన్ లైన్ గేమ్‌‌లకు అలవాటు పడి ఆర్థికంగా ఇబ్బందులకు గురై సూసైడ్ చేసుకున్నాడు. ఇలా మరికొందరు కూడా ఆన్ లైన్‌‌ బెట్టింగ్‌‌లో భారీ మొత్తంలో నష్టపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్, గేమింగ్‌‌లపై గట్టిగా నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ జీవన్‌‌ రెడ్డి తెలిపారు.

 నిజామాబాద్​లో ఏడుగురు అరెస్ట్ 

నిజామాబాద్,​ ఆర్మూర్​లో ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను గుర్తించి కేసు నమోదు చేశామని సీపీ సాయి చైతన్య శుక్రవారం తెలిపారు. ఆన్​లైన్ బెట్టింగ్ మాస్టర్లు, ఏజెంట్లు, బుకీలుగా పని చేస్తూ యువతకు గాలం వేస్తున్న ఈ రెండు గ్రూప్​లకు చెందిన ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. పరారీలో ఉన్న 9 మందిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. 

మహారాష్ట్ర ధర్మాబాద్​కు చెందిన మాస్టర్ బుకీ సచిన్ కు నిజామాబాద్​కు చెందిన షేక్ ముజీబ్, షేక్ నదీం, షేక్​జునైద్, షేక్ రహ్మాన్, షేక్ నజీబ్, సచిన్, రమేశ్ ఏజెంట్లుగా పని చేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. వీరిలో షేక్ ముజీబ్, షేక్ నదీం, షేక్​జునైద్, షేక్ రహ్మాన్, షేక్ నజీబ్ లను అరెస్ట్ చేశామని వెల్లడించారు. వీరు బెట్టింగ్​లో 1000 మందిని జాయిన్ చేసుకున్నట్లు తేలిందన్నారు. 

5 వేల ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని, 200 మందిని మోసం చేశారని గుర్తించామన్నారు.  ఆర్మూర్ టౌన్​లో ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న గట్టడి గౌతం, దయాళ్ సునీల్, జాబు రంజిత్​లను అరెస్టు చేశామని సీపీ సాయి చైతన్య చెప్పారు.