కనులపండువగా ఎదుర్కోలు ఉత్సవం.. భద్రాద్రిలో నయనానందకరంగా వేడుక

కనులపండువగా ఎదుర్కోలు ఉత్సవం.. భద్రాద్రిలో నయనానందకరంగా వేడుక

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం శనివారం రాత్రి కనులపండువగా జరిగింది. తొలుత ఉత్సవ మూర్తులను అలంకరించి.. విశ్వక్షేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. గరుడ వాహనంపై రామయ్య, పల్లకిలో సీతమ్మ, లక్ష్మణుడు తరలిరాగా.. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా రాజవీధి గుండా తీసుకొచ్చారు. అనంతరం వైకుంఠ మండపంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. 

రాముడు, సీత తరఫున వేద పండితులు విడిపోయి.. వాళ్లిద్దరి గొప్పతనాన్ని వివరిస్తూ వేడుక నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఎండోమెంట్ ప్రిన్సిపల్​సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ పట్టువస్త్రాలు అందజేశారు. చేనేత కళాకారులు స్వయంగా నేసిన పట్టుచీర, పట్టుపంచను బహూకరించారు. ఆనవాయితీ ప్రకారం జీయర్​ స్వామి మఠం నుంచి త్రిదండి దేవనాథ జీయర్ ​స్వామిజీ పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. వీటినే కల్యాణం రోజు మూలమూర్తులకు అలంకరిస్తారు. వస్త్ర సమర్పణ కాగానే అందరిపై గులాం రంగును చల్లారు. అనంతరం స్వామి వారు తిరువీధి సేవకు వెళ్లారు.