భద్రాచలంలో సీతారామయ్య కల్యాణ వైభోగం

భద్రాచలంలో సీతారామయ్య కల్యాణ వైభోగం

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి పునర్వసు నక్షత్రం వేళ గురువారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. ముందుగా గర్భగుడిలో ఉత్సవమూర్తులకు సుప్రభాత సేవ అనంతరం విశేష స్నపన తిరుమంజనం చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లి కల్యాణ క్రతువును ప్రారంభించారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, కంకణధారణ, రక్షాబంధం, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యాధారణ, తలంబ్రాల వేడుక చేసి మంత్రపుష్పం సమర్పించారు. మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత రాజబోగం నివేదించారు.

సాయంత్రం దర్బారు సేవ జరిగింది. పునర్వసు సందర్భంగా సీతారామయ్యకు తిరువీధి సేవ నిర్వహించారు. సుందరకాండ రామదండు భద్రాచలం భక్తుల ఆధ్వర్యంలో 108వ సుందరకాండ పారాయణం చిత్రకూట మండపంలో జరిగింది. ముందుగా భక్తులంతా గోవిందరాజస్వామి ఆలయం నుంచి రాజవీధి గుండా గిరిప్రదక్షిణ చేసి ఆలయానికి చేరుకున్నారు.

కాగా శుక్రవారం భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం కోసం తెలంగాణ గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ఐటీసీ గెస్ట్ హౌస్​కు చేరుకున్నారు. కలెక్టర్​ జితేశ్​వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా స్వాగతం పలికారు. కాగా గవర్నర్​ పర్యటనకు భద్రాచలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సారపాక-భద్రాచలం మార్గంలో బందోబస్తు కల్పించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఉప పురాణం పుస్తక ఆవిష్కరణ

భద్రాచలం రామాలయం రామ పారాయణదారుడు ఎస్టీజీ కృష్ణమాచార్యులు రచించిన పురాణ దర్శనం పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గురువారం రాత్రి ఐటీసీ గెస్ట్ హౌస్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్​వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, దేవస్థానం ఈవో రమాదేవి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.