వైభవంగా సీతారాముల కల్యాణం

  •     బ్రహ్మాండంగా భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవం
  •     ఉమ్మడి జిల్లాలో భక్తులతో కిక్కిరిసిన రామాలయాలు

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా  జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కల్యాణం చూసి పులకించిపోయారు. ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, నదీ మాతకు పూజలు చేశారు.  అనంతరం మిథిలాప్రాంగణానికి వచ్చారు. కల్యాణం వీక్షించాక వారికి ఉచితంగా దేవస్థానం దర్శనంతో పాటు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉచితంగా తలంబ్రాలనూ పంపిణీ చేసింది. స్వయంగాఎండోమెంట్​ కమిషనర్​ హన్మంతరావు ప్యాకెట్లు పంపిణీ చేశారు.

సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధి సేవకు గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు. శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభమయ్యాయి. మే 13వ తేదీ వరకు రామభక్తులు ఈ దీక్షల్లో స్వామిని సేవిస్తారు.  వేడుకలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతోపాటు పలువురు అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు. కాగా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన అంకినపల్లి భద్రయ్య గోదావరిలో కొట్టుకుపోతుండగా గజ ఈతగాళ్లు కాపాడారు. 

‘జై శ్రీరాం’.. మారుమోగిన ఆలయాలు.. 

వెలుగు, నెట్​వర్క్​ :  ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీసీతారాముల పెండ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. జై శ్రీరాం.. అంటూ రామాలయాలన్నీ మారుమోగాయి. ఇల్లెందు మండలం సత్యనారాయణపురం హాజరత్ ఖాసిమ్ మౌలా చాన్ దర్గాలో శ్రీసీతారాముల కల్యాణాన్ని భక్త జనసందోహం మధ్య నిర్వహించి మత సామరస్యానికి పెద్దపీట వేశారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి శ్రీరామ భక్తులకు మజ్జిగ, బెల్లం పానకాన్ని పంపిణీ చేశారు.

కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పాల్వంచ మండలాల్లోని పలు కల్యాణ మండపాల్లో సీపీఐ స్టేట్​ సెక్రటరీ, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ములకలపల్లి లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలోని వేడుకలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు. ఖాన్ పేటలోని  రామాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక పూజలు చేశారు. పలుచోట్ల ప్రముఖ నాయకులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.