బీజేపీలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు

బీజేపీలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు

రాంచీ: లోక్​సభ ఎన్నికల ​ముందు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్​శిబూ సోరెన్ పెద్ద కోడలు, ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంగళవారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జార్ఖండ్ ఎన్నికల ఇన్‌‌‌‌చార్జ్ లక్ష్మీకాంత్ బాజ్‌‌‌‌పాయ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్​తర్వాత ఆయన భార్య కల్పనను ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం జరగగా సీతా సోరెన్​బహిరంగంగానే వ్యతిరేకించారు.

 దీంతో అప్పటి నుంచి సోరెన్ కుటుంబంలో చీలిక వచ్చింది. కాగా, తన భర్త మరణం తర్వాత తనకు, తన కుటుంబానికి తగిన సహాయాన్ని అందించడంలో పార్టీ విఫలమైందని, తనను ఒంటరిని చేసి, నిర్లక్ష్యం చేస్తున్నారని అందుకే జేఎంఎంకు రాజీనామా చేశానని పార్టీ చీఫ్, ఆమె మామ శిబూ సోరెన్‌‌‌‌కు పంపిన రాజీనామా లేఖలో ఆమె పేర్కొన్నారు.

 “జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నా భర్త దుర్గా సోరెన్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన మరణించిన తర్వాత నేను, నా కుటుంబం నిరంతరం నిర్లక్ష్యానికి గురవుతున్నాము. కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని పట్టించుకోవడంలేదు. ఇది నన్ను చాలా బాధించింది. కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడుతుందని నేను ఆశించాను.. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు” అని సీతా సోరెన్​ ఆవేదన వ్యక్తం చేశారు.