సుగుణక్కకు తోడైన సీతక్క .. బీజేపీ, బీఆర్ఎస్ లకు ధీటుగా ప్రచారం

  • కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకు జిల్లాలను చుట్టేస్తున్న మంత్రి

ఆదిలాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జిల్లాకు ఇన్​చార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సీతక్క ఉమ్మడి జిల్లాలో తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో  సుగుణక్కకు తోడుగా సీతక్క దూసుకుపోతున్నారు.  కాంగ్రెస్​ శ్రేణులతో జిల్లాలో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.  సీతక్క మూడు నెలల్లోనే ఇక్కడి ప్రజలకు అభిమానులయ్యారంటూ అందరినోటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించేందుకు సీతక్క పాటుపడుతున్నారు.  

జిల్లాలో ఒక్కోరోజు మూడు నాలుగు మండలాలను చుట్టేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లకంటే ప్రచారంలో ఒక అడుగు ముందుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్లలో చేసిన అభివృద్ధిపై ప్రశ్నిస్తూ  ప్రచారాని పదును పెడుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ వచ్చిన వందరోజుల్లో చేసిన పనులను   విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.  బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, బీజేపీ అభ్యర్థి గొడం నగేశ్ రాజకీయాల్లో, ప్రజాప్రతినిధులుగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ కొత్తగా బరిలో నిలిచిన సుగుణక్క వారికి ఎక్కడ తీసిపోవడం లేదు. సీతక్క బలంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 

ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలో  మహిళ అభ్యర్థి బరిలో ఉండటం  ఇదే మొదటి సారి.  కాగా ఆ మహిళను గెలిపించే బాధ్యతలు మరో మహిళ నేత తీసుకోవడం కూడా ఫస్ట్ టైం కావడం విశేషం.   ఇద్దరు ఆదివాసీలు అందులోనూ మహిళ నేతలు కావడం తో మహిళ ఓటర్లు కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపుతారని  విశ్లేషకులు అంచనా వేస్తన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న సీతక్క ఉమ్మడి జిల్లా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ ని నడిపిస్తున్నారు. 

ఆత్రం సుగుణ మొదటి సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ కొత్త అభ్యర్థి అనే విషయాన్ని మర్చిపోయేలా అందరితో మమేకమవుతూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలోని ఆదివాసీల్లో ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా కూడా ఆదివాసీ గూడెలు, తాండాల్లో మంత్రి సీతక్క, సుగుణక్క  ఆదివాసీలకు భరోసా కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అన్ని పార్టీలకంటే ముందే జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. 

ఆపరేషన్ ఆకర్ష్ తో మొదలు పెట్టి..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి ఉనికి లేదు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఇన్​చార్జి మంత్రిగా వచ్చిన సీతక్క ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్, బీజేపీ నేతల చేరికలను విజయవంతంగా పూర్తి చేశారు. 

సర్పంచ్ లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, డీసీసీబీ డైరెక్టర్లతో పాటు ఇతర పార్టీ సీనియర్ లీడర్లంత కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరిపోయారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో పార్టీ క్షేత్ర స్థాయిలో బలంపుంజుకుంది. ఒకప్పుడు గ్రూపు రాజకీయాలతో దిగజారిపోయిన ప్రతిష్టను సీతక్క పూర్వవైభవం తీసుకొచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలను ఓ సవాల్ గా తీసుకున్న సీతక్క ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.