KL Rahul: ఆరో స్థానంలో రాహుల్ బ్యాటింగ్.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే..?

KL Rahul: ఆరో స్థానంలో రాహుల్ బ్యాటింగ్.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే..?

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ప్రస్తుతం జరుగుతన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ లాంటి అద్భుత ప్రతిభ గల ఆటగాడిని ఆరో స్థానంలో బ్యాటింగ్ కు పంపడంపై హెడ్ కోచ్ గంభీర్ తో పాటు జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలొచ్చాయి. ముఖ్యంగా రాహుల్ కంటే ముందు అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టు విజయాల కోసం రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చి అతని కెరీర్ ను నాశనం చేస్తున్నారని నెటిజన్స్ అంటున్నారు. 

బ్యాటింగ్ లో ఇలా మార్పులు చేయడం రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే రాహుల్ కు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ చెప్పాడు. రాహుల్ ప్రతిభను హైలెట్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. " రాహుల్ ఓపెనింగ్ చేయగలడు. నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ ఆడగలడు. ఆరో నంబర్ లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏ పాత్రలోనైనా అతను త్వరగా అలవాటు పడతాడు. అతనికి మేము ఇచ్చిన పాత్రపై చాలా సంతృప్తికరంగా ఉన్నాడు. రాహల్ పై ఎలాంటి బలవంతం లేదు".  అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ ఫైనల్ కు ముందు తెలిపాడు.

ALSO READ | Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. విండీస్ విధ్వంసకర ఓపెనర్ రికార్డ్‌పై కోహ్లీ గురి

వన్డేల్లో రాహుల్ కు ఐదో స్థానంలో సూపర్ రికార్డ్ ఉంది.50 ఓవర్ల ఫార్మాట్ లో ఐదో స్థానంలో 50కి పైగా యావరేజ్ ఉంది. అయితే ఏడాది కాలంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ నుండి అతను ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరో స్థానంలో కూడా రాహుల్ అదరగొడుతున్నాడు. ఒత్తిడి సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఇటీవలే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 42 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.