భద్రాచలంలో కన్నుల పండువగా రాముని లగ్గం

  • వైభవంగా రాములోరి కల్యాణం
  • ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు 
  • సమర్పించిన సీఎస్​ శాంతికుమారి
  • హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సురేఖ
  • భక్తుల రామనామ స్మరణతో మార్మోగిన భద్రాచల పురవీధులు
  • నేడు మహాపట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్

శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. అభిజిత్​ లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతమ్మవారికి మాంగల్యధారణ జరిగింది. రామనామస్మరణతో భద్రాచలం పురవీధులన్నీ మార్మోగాయి. మరోవైపు, అయోధ్యలోని రామాలయంలో రామ్​లల్లా నుదుటిపై ‘సూర్య తిలకం’ భక్తులకు కనువిందు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిపై పడ్డాయి. దాదాపు మూడు నిమిషాల పాటు ఈ ‘సూర్య తిలకం’ భక్తులకు కనిపించింది.

భద్రాచలం, వెలుగు : అశేషభక్తజనం రామనామ స్మరణ చేస్తుండగా అభిజిత్‍లగ్నంలో రఘుకులోత్తముడు కల్యాణరాముడయ్యాడు.  జానకీ మాతను పరిణయమాడి సీతారాముడయ్యాడు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుకను కన్నులపండువగా నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల నడుమ  దశరథుడు, జనకుడితో పాటు భక్తుల తరుపున భక్తరామదాసు చేయించిన మూడుసూత్రాలతో.. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతమ్మవారికి మాంగల్యధారణ జరిగింది. రామనామస్మరణతో భద్రాచలం పురవీధులన్నీ మార్మోగాయి.  తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్​ శాంతికుమారి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

సుప్రభాత సేవతో వేడుక ప్రారంభం

బుధవారం తెల్లవారుజామున 2  గంటలకే స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. ధృవమూర్తులకు విశేషంగా కల్యాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎస్​ శాంతికుమారి దంపతులతోపాటు  ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్​, కమిషనర్‍ హన్మంతరావు, జిల్లా కలెక్టర్​ ప్రియాంక ఆల తదితరులు హాజరయ్యారు. అనంతరం కల్యాణమూర్తులను పల్లకిలో మంగళవాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం ప్రాంగణానికి తీసుకొచ్చారు. రజత సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. తిరువారాధన,  విష్వక్సేన పూజ, పుణ్యహవచనం చేసి మండప శుద్ధి చేశారు.

స్వామివారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణం జరిపించారు. వధూవరుల వంశగోత్రాలకు సంబంధించి ప్రవరలు చదివి.. వరపూజ నిర్వహించారు. కల్యాణం సందర్భంగా భక్తరామదాసు చేయించిన పచ్చల, చింతాకు పతకాలను వధూవరులకు అలంకరించారు. శ్రీరంగం, తిరుమల తిరుపతి, శృంగేరీపీఠం, భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాస్‍ సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. జస్టిస్​ హరినాథ్​, జస్టిస్​ సుమంతి, ఐటీడీఏ పీవో ప్రతీక్​జైన్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కూడా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

భద్రాద్రి రాముడి కల్యాణ ప్రాశస్త్యంతోపాటు భక్తరామదాసు చేయించిన ఆభరణాల విశిష్టతను స్థానాచార్యులు స్థలసాయి వివరించారు. కన్యాదానంతోపాటు గోదానం, భూదానం కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా చేపట్టారు. రామభద్రుడికి సీతామాతకు వేర్వేరుగా మంగళాష్టకం చదివారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్‍లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లాన్ని ఉత్సవమూర్తుల శిరస్సుపై ఉంచారు. సూత్రధారణ కన్నులపండువగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా తలంబ్రాల కార్యక్రమం జరిపించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్​ స్వామి పర్యవేక్షణలో కల్యాణ క్రతువు నిర్వహించారు.

నేడు భద్రాద్రికి గవర్నర్​ 

భద్రాచలంలో గురువారం శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్​ సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.​  మహాపట్టాభిషేకంలో పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

హాజరైన ప్రముఖులు

సీతారాముల కల్యాణం చూసేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,​ కొండా సురేఖ హాజరయ్యారు. వీరితోపాటు ఎండోమెంట్​ ప్రిన్సిపల్​సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్​ హన్మంతరావు, ఐజీ రంగనాథ్​, మిషన్​భగీరథ స్పెషల్ ఆఫీసర్​ సురేంద్రమోహన్, కలెక్టర్​ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్​ రాజ్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జి నర్సింహ, హైకోర్టు జడ్జి భీమపాక నగేశ్​, అడ్వొకేట్​ జనరల్ సురేందర్​రెడ్డి, ట్రైబల్​ వెల్ఫేర్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ శరత్​, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఏఎస్పీ పంకజ్​ పరితోశ్​​, పీవో ప్రతీక్​జైన్ ఉన్నారు.