- ఇంటికెళ్లి ఆహ్వానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- గిరిజనులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శ
- గౌరవమిచ్చే పార్టీలోనే చేరుతా: సీతారాం నాయక్
- బీఆర్ఎస్లో అవమానాలే మిగిలాయని కామెంట్
వరంగల్, వెలుగు : మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హన్మకొండలోని సీతారాం నాయక్ ఇంటికెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘సీతారాం నాయక్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గిరిజనుల సమస్యలపై పోరాటం చేశారు.
గిరిజన వర్సిటీ నిర్మాణం కోసం కృషి చేశారు. బీజేపీలోకి వస్తే సరైన గుర్తింపు ఇస్తాం’’అని కిషన్ రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పదేండ్ల పాటు గిరిజనులను మోసం చేసిందన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేసీఆర్ భూమి కూడా ఇవ్వలేదన్నారు.
నేను సీఎంగా అక్కరకు రానా? : సీతారాం నాయక్
బీఆర్ఎస్ లో తనకు అవమానాలే మిగిలాయని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. గౌరవం ఇచ్చే పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి తన ఇంటికొచ్చి బీజేపీలో ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ‘‘రాష్ట్రానికి నువ్వు రెండు.. మూడు సార్లు సీఎం అవ్వొచ్చు.. దిక్కు లేనోడు.. అయ్యవ్వ లేనోడు.. రాష్ట్రాన్ని పాలించొచ్చు. ఒక ప్రొఫెసర్గా, ఎంపీగా ప్రజలకు సేవ చేసిన నేను.. సీఎంగా అక్కరకు రానా?’’అంటూ బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శించారు.
రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి ఎంతో కష్టపడినట్టు గుర్తు చేశారు. ‘‘పార్టీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసిన. అయినా.. నన్ను పార్టీ పెద్దలు అవమానించిన్రు. వారి తీరుతో ఎంతో బాధపడ్డ. నేను వేరే పార్టీలో చేరడం అంటే బీఆర్ఎస్కు ద్రోహం చేసినట్టు కాదు.. నాకే పార్టీ ద్రోహం చేసింది. ఎవరైనా నేతలు తమకు గౌరవం దక్కే పార్టీలోనే పోవాలనుకుంటరు. నేను కూడా అలాంటి పార్టీలోకే వెళ్తాను. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో సమావేశమై తుది నిర్ణయం తీస్కుంటా’’అని సీతారాం నాయక్ అన్నారు. కాగా, సీతారాం నాయక్ బీజేపీలో చేరితే.. మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జోరందుకుంది.