సీతారామ ట్రయల్ రన్ సక్సెస్: మంత్రి తుమ్మల

సీతారామ ట్రయల్ రన్ సక్సెస్: మంత్రి తుమ్మల
  • ఫేజ్1 పంప్ హౌస్ మోటార్ల స్విచ్​ ఆన్ ​చేసిన ఆఫీసర్లు
  • ఆగస్టులో సాగునీరు విడుదల చేస్తం: మంత్రి తుమ్మల
  • మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 
  • 1.20 లక్షల ఎకరాలకు ఇస్తమని వెల్లడి

భద్రాద్రి కొత్తగూడెం / అశ్వాపురం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 6.74 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్​రన్ సక్సెస్ అయింది. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో నిర్మించిన సీతారామ ఎత్తిపోతల పథకం ఫేజ్1 పంప్ హౌస్​లో గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో ప్రాజెక్ట్ ముఖ్యసలహాదారు పెంటారెడ్డి స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా గోదావరి నీళ్లకు మంత్రి నమస్కరించారు. తర్వాత మాట్లాడుతూ ట్రయల్ రన్ సక్సెస్ అయినట్టు ప్రకటించారు. సీఎం రేవంత్​రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో ఈ ప్రాజెక్ట్​ను పూర్తి చేస్తానని చెప్పారు. 

గోదావరి నీళ్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందించే లక్ష్యంతో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను అడిగిందే తడవుగా ఫండ్స్ ఇచ్చారన్నారు. ఆగస్టు నెలాఖరులోగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 1.20 లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందించేందుకు పక్కాగా ప్లాన్ చేశామన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లను మూడేండ్లలో దశలవారీగా ఇవ్వనున్నట్టు తెలిపారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీడు భూములను గోదావరి నీళ్లతో సాగు భూములుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫేజ్ 2,3 పంప్​హౌస్​ల మోటార్ల  ట్రయల్ రన్ త్వరలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పంప్ హౌస్ ల ద్వారా 1,500 సెక్కుల నీరు రిలీజ్ చేయనున్నామన్నారు. జిల్లాలో నాలుగు పంపుల ద్వారా నీటి సరఫరా కోసం 104 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులు పూర్తి చేశామన్నారు. ఏన్కూర్ వద్ద నాగార్జున సాగర్ కాలువకు దీన్ని లింక్ చేయనునట్టు తెలిపారు. 

ఈ క్రమంలో మధ్యలో గల చెరువులన్నింటిని గోదావరి నీళ్లతో నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టుకు, కాలువలకు భూములిచ్చిన రైతులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ చీఫ్​ ఇంజనీర్​ శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.