ఏడేండ్లు 7 వేల 500 కోట్లు .. ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే

  • పైసలు వచ్చే మట్టి పనులు మాత్రం చేసిన్రు
  • కీలకమైన హెడ్ వర్క్​లో ఆలస్యం  
  • భూసేకరణ చిక్కులతో ప్యాకేజీ –9 పనులు లేట్​ 
  • స్పీడ్​పెంచాలని డిప్యూటీ సీఎం, మంత్రుల ఆదేశం

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో దాదాపు 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఏడేండ్ల కింద చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదు. గత బీఆర్ఎస్​ సర్కారు ఈ ప్రాజెక్టుపై రూ.7,500 కోట్లు ఖర్చు చేసినా ఇప్పటివరకు ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. పైసల కోసం మట్టి పనులు, టెయిల్ వర్క్స్ చకచకా పూర్తి చేసి,  ప్రాజెక్టు దగ్గర కీలకమైన హెడ్​వర్క్స్ ఆలస్యం చేయడం వల్ల ఆయకట్టుకు నీళ్లివ్వలేని పరిస్థితి వచ్చింది. పంప్​హౌస్​, టన్నెల్స్ ​పనులు స్లోగా సాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్​ చేస్తే తప్ప  స్పీడందుకునే పరిస్థితి కనిపించడం లేదు. 

2016లో పనులకు శంకుస్థాపన.. 

సీతారామ ప్రాజెక్ట్​కు 2016 ఫిబ్రవరి 16న రోళ్లపాడు దగ్గర అప్పటి సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేశారు.18 నెలల్లో పనులు కంప్లీట్ చేస్తామని చెప్పినా, భూ సేకరణ సమస్య, నిధుల కొరత వల్ల  ఆలస్యమవుతూ వచ్చింది.  ప్రాజెక్ట్​ 100 శాతం పూర్తి కావడానికి మరో రెండేండ్లయినా పడుతుందని నిపుణులు చెప్తున్నారు. మొత్తం ప్రాజెక్టును16 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవగా, మేఘా, ఎల్​అండ్​టీతో పాటు మరికొన్ని సంస్థలు పనులు దక్కించుకున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.13,384 కోట్లు కాగా, ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు. త్వరగా పూర్తయి పైసలు వచ్చే మట్టి, కాల్వల పనులు కంప్లీటైనా ప్రాజెక్టు దగ్గర హెడ్​వర్క్స్​ఆలస్యమవుతున్నాయి.

బీజీ కొత్తూరు, ఒడ్డు రామవరం, కమలాపురం, గండుగులపల్లి వద్ద కలిపి నాలుగు పంప్​హౌస్​ లు కడుతున్నారు. మూడు పంప్​ హౌస్​ల నిర్మాణం పూర్తయినా గండుగులపల్లి దగ్గర పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పంప్​హౌస్​నుంచి గ్రావిటీ కెనాల్​కు కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. మొత్తం మూడు టన్నెల్స్​కు రెండు టన్నెల్స్​పనులు జరుగుతున్నాయి. పాలేరు ట్రంక్​​లో భాగంగా దాదాపు 8 కిలోమీటర్ల మేర టన్నెల్ ​తవ్వాల్సి ఉండగా, ప్రస్తుతానికి 320 మీటర్లు మాత్రమే పూర్తయింది. సత్తుపల్లి ట్రంక్​లో యాతాలకుంట దగ్గర నిర్మిస్తున్న టన్నెల్1.78 కిలోమీటర్లకు.. ప్రస్తుతానికి 190 మీటర్లు మాత్రమే పూర్తయింది. వైరాకు వెళ్లే మెయిన్​ కెనాల్​ లో కాల్వకు బదులు మరో టన్నెల్ నిర్మించాలని రీసెంట్ గా నిర్ణయించారు.  

మే నెలాఖరుకల్లా  1.60 లక్షల ఎకరాలకు నీరు..! 

సీతారామ ప్రాజెక్టు పనుల తీరుపై ఇటీవల హైదరాబాద్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. పనులు ఆలస్యమవుతుండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండుగులపల్లి దగ్గర నిర్మిస్తున్న పంప్​హౌస్​ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్ది రోజుల కింద పరిశీలించారు. ఆయకట్టుకు నీరు రావాల్సిన చోట పనులు జరగలేదని, వర్క్స్​ స్పీడప్ ​చేయాలని,  వీలైనంత త్వరగా సాగునీరందించాలని ఆయన ఆదేశించారు.

రూ.70 కోట్లు ఖర్చు పెట్టి లింకు కాలువ తవ్వడం ద్వారా, నాగార్జున సాగర్​ కాల్వలను ఉపయోగించుకొని ఈ ఏడాది 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని చెప్పారు. వైరా ప్రాజెక్టు, లంకాసాగర్​, బేతుపల్లి రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి, వాటికింద ఉన్న ఆయకట్టుకు నీరందించవచ్చని అన్నారు. మే తతతతతతనెలాఖరు కల్లా రైతులకు నీరిచ్చే అవకాశాలున్నాయన్నారు. ప్రధాన కాలువకు ఏన్కూరు వద్ద లింకు కాలువను నిర్మించాలని, వైరా ప్రాజెక్టుకు అనుసంధాన కాలువ కట్టాలని.. ఈ రెండు పనులకు వెంటనే టెండర్లు పిలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.

భూసేకరణలో చిక్కులు

9, 10, 11, 12 ప్యాకేజీల్లో భాగంగా సత్తుపల్లి, అశ్వారావుపేట పరిసరాల్లో పనులు జరుగుతున్నాయి. 72 కిలోమీటర్ల దూరం గ్రావిటీ కెనాల్​ పనులకు భూసేకరణ చిక్కులున్నాయి. ఎకరానికి రూ.10.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఆఫీసర్లు చెబుతుండగా, అది ఏ మాత్రం సరిపోదంటూ రైతులు అభ్యంతరాలు చెబుతున్నారు.

దాదాపు 280 ఎకరాల పట్టా భూమికి సంబంధించి భూసేకరణ త్వరగా జరిగితే పనులు వేగంగా పూర్తయ్యే అవకాశముంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 19,611 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇందులో 13,593 ఎకరాలు అటవీయేతర భూములు కాగా, 4,924 ఎకరాల ఫారెస్ట్ భూమి, 1,094 ఎకరాల వన్యప్రాణి సంరక్షణ విభాగానికి చెందిన భూమి ఉంది. ఫారెస్ట్ భూముల  క్లియరెన్స్​లో ఆలస్యం,  భూసేకరణ చిక్కుల వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.

టన్నెల్ పనులు స్పీడందుకుంటేనే...  

మహబూబాబాద్​ జిల్లాలో 13, 14 ప్యాకేజీ పనులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో పాలేరు ట్రంక్​లోని 15 ,16 ప్యాకేజీ  పనులు స్పీడ్​గా నడుస్తున్నాయి. మొత్తం 8 కిలోమీటర్ల టన్నెల్​ కు గాను బీరోలు దగ్గర దమ్మాయిగూడెం వైపు ప్రస్తుతం టన్నెల్​వర్క్ ​స్టార్టయ్యింది. ఇప్పటి వరకు 320 మీటర్ల పనులు పూర్తయ్యాయి. రోజుకు 7 నుంచి 8 మీటర్ల సొరంగాన్ని తవ్వుతున్నారు. ఇంకో మూడు నెలల్లో మరో మూడు చోట్ల పనులు ప్రారంభించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. పూర్తిగా 15 నెలల్లో టన్నెల్​తో పాటు సీలింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు.

సత్తుపల్లి ట్రంక్​లో భాగంగా ప్యాకేజీ –9లో యాతాలకుంట దగ్గర 1.78 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉంది. ఇప్పటి వరకు190 మీటర్ల మేర పని కంప్లీటయ్యింది. ప్యాకేజీ–8లోని మరో మెయిన్ ​టన్నెల్​పని ఆగింది. ఓపెన్​ కాల్వ తవ్వాలా లేక టన్నెల్​ నిర్మించాలా అనే సందిగ్ధంలో ఇప్పటి వరకు ఉండగా, భూసేకరణ ఇబ్బందులు తప్పించుకునేందుకు రీసెంట్​గా 1.65 కిలోమీటర్ల టన్నెల్​ను ఫైనల్​ చేశారు. దాని పనులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది.