
- 24న మరోసారి టీఏసీ సమావేశం
- ఫిబ్రవరిలో నిర్వహించిన సమావేశంలో డిజైన్లపై రివ్యూ చేయాలని ఆదేశం
- తాజాగా రివైజ్డ్ డిజైన్స్ ఇచ్చిన అధికారులు.. సీడబ్ల్యూసీ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: సీతారామ సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇక లాంఛనమే కానున్నాయి. ఈ నెల 24న సెంట్రల్ వాటర్ కమిషన్ టెక్నికల్ అప్రయిజల్ కమిటీ (టీఏసీ)లో ఆ ప్రాజెక్టు అనుమతులపై చర్చించనున్నారు. కేంద్ర జలశక్తిశాఖ రివర్ బోర్డుల గెజిట్‌లోని ఫ్లో చార్ట్‌ను అనుసరించి ప్రాజెక్టు డీపీఆర్‌పై జీఆర్‌ఎంబీకి గతేడాది ఏప్రిల్‌లో పంపించింది. బోర్డు కూడా అదే ఏడాది మే నెలలో సమావేశాన్ని నిర్వహించింది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలతో తిరిగి కేంద్రానికి నివేదించింది.
అయితే నాటి నుంచి టీఏసీ సమావేశాన్ని నిర్వహించకపోవడంతో తుది అనుమతుల మంజూరు పెండింగ్‌లో పడిపోయింది. గత ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తిశాఖ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీ ఆధ్వర్యంలో అప్రయిజల్ కమిటీ 157వ సమావేశాన్ని నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు అనుమతులపై కమిటీ మెంబర్లు, అన్ని విభాగాల డైరెక్టర్లు చర్చించారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడంతో టీఏసీ.. సీతారామ ప్రాజెక్టు అనుమతులను తిరస్కరించింది. బ్యారేజీ డిజైన్లను పరిశీలించాల్సిందిగా సీడబ్ల్యూసీ సూచించింది.
సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ సీడీవో రూపొందించిన డిజైన్లను పరిశీలించాకే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. భూకంపన, పలు సాంకేతిక పరీక్షలను నిర్వహించి ఆ నివేదికలను సమర్పించాలని కండిషన్ పెట్టింది. ఇటీవల టీఏసీ సూచనలతో అందుకు సంబంధించిన నివేదికలను సీడబ్ల్యూసీకి తెలంగాణ సమర్పించింది. డిజైన్లపై సీడబ్ల్యూసీ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సీతారామ ప్రాజెక్టు అనుమతుల మంజూరు అంశాన్ని మరోసారి టీఏసీకి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే 24న ఢిల్లీలో టీఏసీ 158వ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.