వల్మిడిలో వైభవంగా రాములోరి ప్రతిష్ఠ.. హాజరైన చినజీయర్‌‌‌‌ స్వామి , ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై కొత్తగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయర్‌‌‌‌స్వామి, మంత్రులు టి.హరీశ్‌‌‌‌రావు, ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌‌‌‌ హాజరయ్యారు. వీరికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, కలెక్టర్‌‌‌‌ శివలింగయ్య స్వాగతం పలుకగా అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం చినజీయర్‌‌‌‌ స్వామి సీతారామాంజనేయ విగ్రహాలు, గోపురంపై కలషాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు

పురానత ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కొత్తగా నిర్మిస్తున్న ఆలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని మంత్రి హరీశ్‌‌‌‌రావు చెప్పారు. వల్మిడిలో విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధూపదీప నైవేద్యం కింద రాష్ట్రంలో 3,700 ఆలయాలకు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు ఆధ్వర్యంలో పాలకుర్తి అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. దేశ స్థాయిలో అనేక అవార్డ్స్‌‌‌‌ తీసుకున్న ఘనత ఎర్రబెల్లికే దక్కుతుందని, అత్యధిక అవార్డులు తెచ్చుకున్న మంత్రిత్వశాఖ ఆయనదేనని చెప్పారు. కాగా మునుల గుట్టపై రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చిన్న జీయర్‌‌‌‌ స్వామి కోరగా స్పందించి హరీశ్‌‌‌‌రావు విగ్రహ నిర్మాణంతో పాటు సీతారామచంద్రస్వామి కొండ నుంచి మునుల గుట్టను కలుపుతూ వేలాడే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

వల్మిడికి వచ్చిన మంత్రులు విగ్రహ ప్రతిష్ఠ అనంతరం పాలకుర్తిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా పాలకుర్తిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాల్కురికి సోమనాథుడి స్మృతివనం, కల్యాణమండపం, హరిత హోటల్, గిరిజన భవన్‌‌‌‌ పనులకు శంకుస్థాపన చేశారు.