అదిలాబాద్ జిల్లా: వసూళ్లకే పరిమితమైన గుర్తింపు సంఘం: సీతారామయ్య

నస్పూర్, వెలుగు: టీబీజీకేఎస్ నాయకత్వంలో యూనియన్ల విలువలు మంట కలిశాయని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య మండిపడ్డారు. ఆదివారం నస్పూర్​లో జరిగిన ఏఐటీయూసీ 12వ బ్రాంచి మహసభలో పాల్గొని మాట్లాడారు. గతంలో సింగరేణి సంస్థ యూనియన్ల మధ్య చర్చలు జరిగి కార్మికుల హక్కులపై చర్చించేవారని, సమస్యలు పరిష్కరించేవారని కానీ టీబీజీకేఎస్ గెలిచిన తర్వాత యూనియన్లతో చర్చలు జరగడంలేదని, అంతా రాష్ట్ర ప్రభుత్వ చెప్పినట్లు చేస్తున్నారని విమర్శించారు.

 యూనియన్లు మాట్లాడితేనే కార్మిక సమస్యలు యాజమాన్యానికి తెలుస్తాయని అలాకాకుండ ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రితో చర్చలు జరపడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో సింగరేణి ఆర్థికంగా బలంగా ఉండేదని, ప్రస్తుతం కార్మికుల జీతాల కోసం బ్యాంకుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుతం ఎస్టీపీపీ కరెంట్ వాడుకుని ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. సింగరేణి దివాలా తీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి జనరల్ సెక్రెటిరీలు రాజ్ కుమార్, వైవీ రావు, వీరభద్రయ్య, బాజీసైదా, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, సీపీఐ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది

బెల్లంపల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయి సంస్థ రోజురోజుకూ ఆర్థిక దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ లోని ఓ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ 16వ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి దివాలా తీస్తోందన్నారు. సింగరేణిలో నేడు ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ కౌన్సిలర్ల  ఇష్టారాజ్యం కొనసాగుతోందన్నారు. 

మందమర్రిలో ఓ నాయకుడు సింగరేణి క్వార్టర్లు కూల్చేసిన ఘటనను అడ్డుకున్న జీఎం మోహన్ రెడ్డిని అక్రమంగా బదిలీ చేయించారని ఆరోపించారు. బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో వైద్య నిపుణులను నియమించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేశ్ అధ్యక్షత వహించిన ఈ ఈ మహాసభల్లో డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, సీనియర్ రాష్ట్ర నాయకులు చిప్ప నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.