ఆశావహులు నారాజ్!..పాలమూరులో సిట్టింగులకే మళ్లీ చాన్స్

ఆశావహులు నారాజ్!..పాలమూరులో సిట్టింగులకే మళ్లీ చాన్స్

మహబూబ్​నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్  ఫస్ట్  ఫేస్​లో క్యాండిడేట్లను ఫైనల్ చేసింది. సోమవారం రిలీజ్  చేసిన ఫస్ట్  లిస్ట్​లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ చాన్స్  ఇచ్చింది. సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం జరిగినా, సిట్టింగు​లందరికీ అవకాశం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో టికెట్  వస్తుందని ఆశలు పెట్టుకున్న లీడర్లు షాక్​కు గురయ్యారు.

పాత కాపులకు ఓకే..

ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుపొందింది. కొల్లాపూర్  నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీరం హర్షవర్ధన్​రెడ్డి గెలవగా, కొద్ది రోజులకే అధికార పార్టీలో చేరారు. దీంతో అన్ని అసెంబ్లీ స్థానాల్లో రూలింగ్  పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం  వహిస్తున్నారు. వీరిపై బీఆర్ఎస్  హైకమాండ్  పనితీరు, ప్రజల్లో వారికున్న అనుకూలతలు, వ్యతిరేకత, సామాజిక అంశాలపై సర్వేలు నిర్వహించింది.

ఈ సర్వేల రిపోర్ట్  ఆధారంగా టికెట్లు కన్​ఫాం చేస్తామని పలు సందర్భాల్లో కేసీఆర్​ ప్రకటించారు. ప్రగతి భవన్​లో జరిగిన సమావేశాల్లోనూ కొందరు లీడర్ల తీరు వల్ల పార్టీ నష్టపోతోందని, తీరు మార్చుకోకపోతే తోకలు కట్ చేస్తామంటూ వార్నింగ్​ కూడా ఇచ్చారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని నాగర్​కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నలుగురు ఎమ్మెల్యేలు, మహబూబ్​నగర్  పార్లమెంట్ పరిధిలో ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం జరిగింది. సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ఉమ్మడి జిల్లాలోని 5 స్థానాల్లో సిట్టింగుల అభ్యర్థిత్వాలను ఖరారు చేయరనే ప్రచారం జరిగింది. కానీ ఫస్ట్  లిస్టులోనే 14 స్థానాల్లో సిట్టింగులకే టికెట్లు కన్​ఫాం చేయడంతో ఈ ప్రచారానికి చెక్  పడినట్లైంది.

తలలు పట్టుకుంటున్న ఆశావహులు..

సిట్టింగులకే టికెట్లు కన్​ఫాం చేయడంతో ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. కల్వకుర్తి నుంచి పోటీ చేసేందుకు కొంత కాలంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా చాన్స్ రాకపోవడంతో ఈసారి సీట్  పక్కా అని భావించారు. కానీ, టికెట్ రాకపోవడంతో ఆయన వర్గీయులు నిరాశ చెందారు. అచ్చంపేట నుంచి నాగర్కర్నూల్ ఎంపీ రాములు కొడుకు భరత్ పోటీలో ఉంటారనే చర్చ జరిగినా, ఊహాగానాలే అని తేలిపోయింది. మాజీ ఎంపీ మంద జగన్నాథం లేదా ఆయన కుమారుడు మందా శ్రీనాథ్, అలంపూర్  నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. మక్తల్ నుంచి వర్కటం జగన్నాథ్​రెడ్డి గతంలో టికెట్ కోసం ఆశించినా సీట్ రాలేదు. అయినా, చిట్టెం గెలుపు కోసం కృషి చేశారు. ఈసారి టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో వీజేఆర్  ఫౌండేషన్  పేరుతో సేవా కార్యక్రమాలు 
నిర్వహించారు.

హ్యాట్రిక్ విజయాలపై నజర్..

ఈ ఎన్నికల్లో ‘కారు’ గుర్తుపై హ్యాట్రిక్  విజయం నమోదు చేసేందుకు లీడర్లు రెడీ అవుతున్నారు. 2014, 2018లో మహబూబ్​నగర్  నుంచి వి.శ్రీనివాస్​గౌడ్, జడ్చర్ల నుంచి సి.లక్ష్మారెడ్డి, దేవరకద్ర నుంచి ఆల వెంకటేశ్వర్​రెడ్డి, అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు, నాగర్​కర్నూల్  నుంచి మర్రి జనార్దన్​రెడ్డి, షాద్​నగర్  నుంచి అంజయ్య యాదవ్  వరుసగా గెలుపొందారు. ఈ సారి వీరికే టికెట్​ రావడంతో హ్యాట్రిక్  విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మక్తల్  నుంచి చిట్టెం రాంమోహన్రెడ్డి, నారాయణపేట నుంచి సుంకిని రాజేందర్​రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొందినా, పోయిన ఎన్నికల్లో మాత్రమే ‘కారు’ గుర్తుపై గెలిచారు.