- జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఘటన
కొడిమ్యాల, వెలుగు: ఇంటి గద్దెపై కూర్చున్న వ్యక్తికి గుండెపోటు రాగా..అదే టైంలో పక్కనే ఉన్న డాక్టర్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల లోని అంగడిబజార్‌లో బుధవారం ఒకరు చనిపోగా..వారి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మల్యాల మండలం తాటిపల్లికి చెందిన పంబల లచ్చయ్య(65) వచ్చాడు. గురువారం ఉదయం బంధువుల ఇంటి గద్దెపై కూర్చొని ఉండగా గుండెపోటుతో పాటు ఫిట్స్ వచ్చింది. కింద పడి కొట్టుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే టైంలో అటుగా వెళ్తున్న కొడిమ్యాల పీహెచ్‌సీ డాక్టర్ నరేశ్..అతడిని పరీక్షించాడు. గుండెపోటు వచ్చిందని నిర్ధారించుకుని సీపీఆర్ చేశాడు. దీంతో లచ్చయ్య స్పృహలోకి వచ్చాడు. స్థానికులు 108కు కాల్ చేసి అందులో జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ కోలుకుని సాధారణ స్థితికి వచ్చాడు. సీపీఆర్‌చేసి కాపాడిన డాక్టర్ నరేశ్‌ను పలువురు అభినందించారు.