
- తడులు అందక ఎండుతున్న పంటలు
- ఆగమవుతున్న అన్నదాతలు
మెదక్, నిజాంపేట, వెలుగు: బోర్లను నమ్ముకొని పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో సకాలంలో నీటి తడులు అందక కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో లక్షకు పైగా వ్యవసాయ బోర్లు ఉండగా వాటి ఆధారంగా రైతులు 1.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తునారు. ఇందులో మెజారిటీ రైతులు వరి పంట మాత్రమే వేశారు.
ప్రారంభంలో బోర్లు బాగానే నీరందించడంతో పంటలు ఏపుగా ఎదిగాయి. క్రమంగా ఎండలు ముదిరే కొద్దీ భూగర్భ జలాలు దిగువకు పడిపోవడంతో ప్రస్తుతం నీటి తడులు అందడం లేదు. ఫిబ్రవరిలో సరాసరి నీటిమట్టం12.98 మీటర్లుగా ఉంది. 2023 ఫిబ్రవరితో పోల్చితే 0.83 మీటర్లకు పడిపోయాయి. జనవరి నెలతో పోల్చితే 1.52 మీటర్లకు పడిపోయాయి. జిల్లాలో గరిష్టంగా రామాయంపేట మండలం డి.ధర్మారంలో భూగర్భజలాలు 24.79 మీటర్లకు పడిపోయాయి. తర్వాత నార్సింగిలో 24.58 మీటర్లు, చిన్నశంకరంపేటలో 22.95 మీటర్లు, రేగోడ్ మండలం గజవాడలో 21.55 మీటర్లకు పడిపోయాయి.
బోర్ల నుంచి సన్నటి నీటిధార
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్ల నుంచి నీరు సరిగా రావడంలేదు. ఇదివరకు పైపు నిండుగా వచ్చిన నీరు ఇపు సన్నటి ధార మాత్రమే వస్తుంది. మరోవైపు ఎండలు ముదరడంతో నీటి తడులు అందక పంటలు ఎండి పోతున్నాయి. దీంతో రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు వాటర్ ట్యాంకర్లు అద్దెకు తీసుకుని నీరు తెచ్చి పంటలకు తడులు అందిస్తున్నారు.
మరికొందరు పశువులకు వదిలేస్తున్నారు. ఎండలు ముదిరిన కొద్దీ భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతాయని అధికారులు చెబుతున్నారు. తాగునీటి ఎద్దడి వచ్చే సూచనలు ఉన్నాయంటున్నారు. ఏప్రిల్, మేలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ఇప్పటి నుంచే నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. జూన్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని చెబుతున్నారు.
ఎకరంన్నర పొలం ఎండిపోయింది
నాకున్న మూడు ఎకరాల్లో ఎకరంన్నర వరి పంట వేశా. పెట్టుబడి యాబై వేల దాకా ఖర్చయింది. కొద్ది రోజుల నుంచి బోరు మొత్తానికే పోస్తలేదు. మరో దిక్కు ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వేసిన వరి మొత్తం ఎండిపోయింది. చేసేదేమీ లేక జీవాలకు వదిలేశాం. పంట ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
కంపె మల్లేశం, రైతు, చల్మెడ
రోజు పది ట్యాంకర్ల నీళ్లు తెస్తున్నా
యాసంగిలో సాగు చేసిన మూడెకరాల వరి పంటను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్న. ఇంకో నెల రోజులైతే పంట చేతికొస్తుంది. పదిహేను రోజులుగా ఐదు కిలోమీటర్ల దూరం నుంచి రోజు పది ట్యాంకర్ల నీళ్లు తెచ్చి పొలానికి తడులు అందిస్తున్నా. ఒక్కో ట్యాంకర్ కు రూ.800 ఖర్చవుతుంది. ప్రభుత్వం నాలాంటివారికి ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుంది.
బాబు, రైతు, చల్మెడ