
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో మిస్సయిన ఆరుగురు పిల్లలను ఎలాగైనా కాపాడాలని స్థానిక పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది. చిన్నారుల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న నిందితులను కోర్టు ముందు నిలబెట్టాలని, ఇటువంటి గ్యాంగ్‌లు సమాజానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. చిన్నారులను అక్రమంగా రవాణా చేసేవారు.. హంతకులకంటే డేంజరని వెల్లడించింది. నవ జాత శిశువులను లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తాలపై జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం సోమవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలస కామెంట్స్ చేసింది.
" ఢిల్లీ చిన్నారుల ట్రాఫికింగ్ రాకెట్‌లోని కీలక వ్యక్తిని పట్టుకోండి. ఏదో ఒకటిచేసి ఇటీవల మిస్సయిన ఆరుగురు పిల్లలను కాపాడండి. శిశువులను కొనుగోలుచేసే, విక్రయించే వారందరూ నిందితులే. వీరు సమాజానికి చాలా ప్రమాదం. హత్యకు ఒక కారణం ఉంటుంది. ఒక హత్య తర్వాత మళ్లీ హత్య జరగకపోవచ్చు. కానీ పిల్లలను కిడ్నాప్ చేసి, విక్రయించేవారు ఈ నేరాన్ని మళ్లీ మళ్లీ చేస్తారు" అని కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఢిల్లీలో చిన్నారుల ట్రాఫికింగ్ కేసులు గతంలో కంటే మరింత పెరిగాయని విచారం వ్యక్తంచేసిన కోర్టు.. రాకెట్ సూత్రధారుల అరెస్టుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
పేరెంట్స్ వద్దంటే బాధ్యత ప్రభుత్వానిదే..
ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో నవజాత శిశువులను రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు విక్రయిస్తున్న పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని కోర్టు గుర్తుచేసింది. నిందితులో చాలా మంది హబిచ్యువల్ ఆఫెండర్స్ అని తెసిందని వ్యాఖ్యనించింది. కొన్ని సందర్భాల్లో పిల్లలను వారి తల్లిదండ్రులే విక్రయిస్తున్నట్లు కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అటువంటి పిల్లలను కాపాడి, తల్లిదండ్రులకు అప్పగిస్తే వారు చిన్నారులను స్వీకరించడం లేదని వివరించారు. కాపాడిన పిల్లలను తల్లిదండ్రులకు తిరిగి తీసుకోకపోతే వారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసింది.