గోదావరి ఎగువ వెలవెల దిగువ జలకళ

గోదావరి ఎగువ వెలవెల దిగువ జలకళ
  • ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి వరకు తేలిన ఇసుక తిన్నెలు
  • చత్తీస్‌‌గఢ్‌‌లో భారీ వర్షం కారణంగా ఉప్పొంగుతున్న ప్రాణహిత
  • కాళేశ్వరం దిగువ ప్రాంతాల్లో ఉధృతంగా పారుతున్న గోదావరి
  •  కుంగిన మేడిగడ్డ వల్ల నీటి నిల్వకు నో ఛాన్స్‌‌

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : గోదావరి నది పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా మారింది. ఎగువ ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో నీటి ప్రవాహం లేక శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌ నుంచి అన్నారం బ్యారేజీ వరకు ఎక్కడికక్కడ ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. ఇదే టైంలో చత్తీస్‌‌గఢ్‌‌లో కురుస్తున్న వాన కారణంగా ప్రాణహిత, ఇంద్రావతి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.

  • భద్రాచలం దగ్గర ఉగ్రరూపం

గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో ఎస్సారెస్పీ మొదలు ఎల్లంపల్లి వరకు కీలకమైన ప్రాజెక్టులన్నీ కనీస నీటి మట్టానికే పరిమితం అయ్యాయి. మరో వైపు  ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల గేట్లన్నీ ఖుల్లా  పెట్టాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ ఒక్కటంటే ఒక్క టీఎంసీ నీటిని కూడా నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. 

ప్రస్తుతం ప్రాణహిత నది వరద కారణంగా కాళేశ్వరం దగ్గర 3.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉండగా, ఇంద్రావతి కలవడంతో ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్‌‌ బ్యారేజీ దగ్గర ఇన్‌‌ఫ్లో 4.80 లక్షల క్యూసెక్కులకు చేరింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థానికంగా ఉన్న వాగుల నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో గడిచిన ఆరు రోజుల్లో 73 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంపాలయ్యాయి.  

  • వెలవెలబోతున్న ప్రాజెక్ట్‌‌లు

ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌‌ కెపాసిటీ 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.13 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. తాజా వర్షాలతో రోజుకు 18,275 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎల్లంపల్లి బ్యారేజీ కెపాసిటీ 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.73 టీఎసీంలకే పరిమితమైంది. ఈ బ్యారేజీకి కేవలం 8,940 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో మాత్రమే వస్తోంది. దీంతో గోదావరిఖని దగ్గర గోదావరినదిలో ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. 

కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సరస్వతి (సుందిళ్ల), పార్వతీ (అన్నారం), లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీల్లో లోపాల కారణంగా ఎన్‌‌డీఎస్‌‌ఏ ఆదేశాల మేరకు గేట్లన్నీ ఖుల్లా పెట్టారు. దీంతో ఈ మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. ఇక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేక మిడ్‌‌ మానేరు, లోయర్‌‌ మానేరు రిజర్వాయర్లకు కూడా ఆశించిన స్థాయిలో ఇన్‌‌ఫ్లో రావడం లేదు. ఎల్‌‌‌‌ఎండీ కెపాసిటీ 24.03 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.08 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. 

  • భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరనున్న నీటిమట్టం

భద్రాచలం, వెలుగు : గోదావరికి ఉపనదుల నుంచి వరద పోటెత్తుతోంది. ఎగువన ఇంద్రావతి, తాలిపేరు, దిగువన శబరి, కిన్నెరసాని ఉపనదుల ఉంచి భారీ ఎత్తున వరద వస్తోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రం 35.3 అడుగులకు చేరుకుంది. 5,99,159 క్యూసెక్కుల వరద వస్తుడడంతో ఆదివారానికి నీటి మట్టం 41 అడుగుల మేరకు చేరుకునే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

  • తాలిపేరు 25 గేట్లు ఎత్తి నీటి విడుదల

తాలిపేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షం కారణంగా చింతవాగు, పగిడివాగులు ఉగ్రరూపం దాల్చడంతో రిజర్వాయర్‌‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో శనివారం 25 గేట్లు ఎత్తి 1,31,840 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. సీఈ శ్రీనివాసరెడ్డి తాలిపేరు ప్రాజెక్ట్‌‌ను తనిఖీ చేసి ఇంజినీర్లతో సమావేశం అయ్యారు. ప్రాజెక్ట్‌‌ వద్దే ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించుకుంటూ నీటిని విడుదల చేయాలని డీఈ తిరుపతిని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వరద పెరిగే అవకాశం ఉన్నందున మొత్తం గేట్లను ఎత్తే ఉంచాలని సూచించారు.