నల్గొండ, వెలుగు:ఫ్లోరోసిస్ సమస్యను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు మునుగోడు నియోజకవర్గంలో చేపట్టిన శివన్నగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడేండ్ల కిందట భూమిపూజ చేసిన ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద శివన్నగూడెం వద్ద రిజర్వాయర్ల పనులకు సీఎం కేసీఆర్ 2015లో శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జనవరి నాటికి పనులు కంప్లీట్చేయాల్సిఉన్నా..సకాలంలో నిధులివ్వకపోవడంతో జాప్యం జరిగింది. ఈ ప్రాజెక్టుల కోసం భూసేకరణ ఎప్పుడో పూర్తయినా పరిహారం ఇవ్వలేదు. పరిహారం కోసం నిర్వాసితులు ఆందోళన చేయడం.. బిల్లులు రాక కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో పనులు నిలిచిపోయాయి. మునుగోడు ఉప ఎన్నికల పుణ్యమాని ఇప్పుడు బాధితులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కృష్ణా ట్రిబ్యూనల్ పేర కొత్త డ్రామాకు తెరలేపింది.
పనులన్నీ పెండింగే...
కృష్ణానదీ జలాల్లో రాష్ట్రం వాటా తేల్చకపోవడంతోనే మునుగోడులో రిజర్వాయర్ల పనులు ఆలస్యమైనట్టు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. పనులు ప్రారంభించి ఏడేండ్లు కాగా.. ఇప్పటివరకు నదీజలాల వాటా గురించి మాట్లాడకుండా తాజాగా ఈ విషయాన్ని తెరపైకి తేవడం ఉప ఎన్నికల స్టంట్‌గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మర్రిగూడెం మండలంలో 11.99 టీఎంసీల కెపాసిటీతో శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. రూ.1,600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కింద లక్షన్నర ఎకరాలకు సాగునీరందిస్తారు. ఇప్పటివరకు రూ.900కోట్లు ఖర్చు కాగా.. కేవలం మట్టి పనులు మాత్రమే చేశారు. నాంపల్లి మండలంలో రూ.800 కోట్లతో కిష్టరాయినపల్లి రిజర్వాయర్‌ను 5.79 టీఎంసీల సామర్థ్యంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్నారు. దీనికి ఇప్పటివరకు రూ.300కోట్లు ఖర్చు పెట్టారు. గుట్టల మధ్య ఉన్న గ్యాప్స్ రిజర్వాయర్ల పనులకు అడ్డంకిగా మారాయి. తొమ్మిది గ్యాప్‌లను ఫిల్ చేయాల్సి ఉండగా రెండు మాత్రమే చేశారు. రిజర్వాయర్ల కింద డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ఊసే సర్కారు మర్చిపోయింది. కాల్వల కోసం సర్వే చేయాలంటూ అధికారులు పంపిన ప్రపోజల్స్.. ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. కిష్టరాయిపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామాలకు చెందిన 262 కుటుంబాలకు ఇళ్లు నిర్మించేందుకు ఇంకా స్థలం అలాట్ చేయలేదు.
నీళ్ల కేటాయింపులోనే క్లారిటీ ఇవ్వలే..
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద తొమ్మిది రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. అసలు డిండి స్కీంకు నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలనే అంశం మీదే సర్కారు ఇప్పటి దాకా క్లారిటీ ఇవ్వలేదు. ఏదుల నుంచి ఇవ్వాలా? ఉల్పర బ్యారేజీ నుంచి తరలించాలా? అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతోంది. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఆధ్వర్యంలో ఒక ప్లాన్.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్మరోప్లాన్ తయారు చేసినా.. వాటి మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా కృష్ణా ట్రిబ్యూనల్ వాటా తేల్చడంలేదని సాకుగా చూపుతుండడంతో ఇప్పట్లో ఈ రిజర్వాయర్లు పూర్తవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.